దాదా.. ఏందిది..?
ఎప్పుడో సాయంత్రం కురిసిన వాన...తుఫానో, కుండపోతనో కాదు, అదీ ఓ మోస్తరుగా పడిందంతే. ! కానీ వర్షం ఆగిపోయిన ఐదు గంటల తర్వాత కూడా ఈడెన్ గార్డెన్స్‌ను మ్యాచ్‌కు ‘క్యాబ్’ అధికారులు సిద్ధం చేయలేకపోయారు. దాల్మియా కన్ను మూసిన తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో టికెట్లపై ఆయన ఫోటోను కూడా ముద్రించి దీనికి విస్తృత ప్రచారం కల్పించారు. పైగా సౌరవ్ గంగూలీ అధ్యక్ష హోదాలో తొలిసారి మ్యాచ్ నిర్వహణలో భాగం అయ్యారు. కానీ మ్యాచ్ నిర్వహించడానికి కావాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని తెలుస్తోంది. మూడు సూపర్ సాపర్లు ఏకధాటిగా పని చేశాయి,
కవర్లు కూడా చాలా ముందే తొలగించి ఇక ఆట జరగడమే ఆలస్యం అన్న బిల్డప్ ఇచ్చారు, కానీ చివరకు ఏదీ సాధ్యం కాలేదు. మా ‘క్రికెట్ మక్కా’ అంటూ భుజాలు చరచుకునే బీసీసీఐకి ఇక్కడి డ్రైనేజీ పరిస్థితి చెంపదెబ్బలాంటిది. దేశంలోని ప్రతిష్టాత్మక స్టేడియంలలో ఒకటిగా పేరున్నా... ఇప్పుడు ఈడెన్ అతి సాధారణ గ్రౌండ్ మాత్రమేనని తాజా పరిస్థితి చూపించింది. అన్ని వైపులనుంచి విమర్శలు రావడం ఒక రకంగా గంగూలీ ప్రతిష్టకు దెబ్బ. 2011 ప్రపంచకప్ సమయంలో స్టేడియం ఆధునీకరణ అంటూ కీలక మ్యాచ్ కోల్పోయిన కోల్‌కతా... డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెట్టకపోతే వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్ ఫైనల్ అవకాశం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.