ఒలింపిక్స్ నుంచి రష్యా అవుట్!
లాసన్నే: రియో ఒలింపిక్స్ గేమ్స్లో రష్యా అథ్లెట్లు పాల్గొనే అంశంపై దాఖలైన పిటిషన్ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) కొట్టివేసింది. ఈ మేరకు రష్యా అథ్లెట్ల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు సీఏఎస్ గురువారం స్పష్టం చేసింది. దీన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) పరిగణలోకి తీసుకోవాలని సీఏఎస్ తన తీర్పులో పేర్కొంది. దీంతో రష్యా పెట్టుకున్న రియో ఒలింపిక్స్ ఆశలకు గండిపడంది.
గత నవంబర్ లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్(ఐఏఏఎఫ్) డోపింగ్ ఆరోపణల కారణంగా రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు వాడా(వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) కూడా రష్యా డోపింగ్ నిరోధక ఏజెన్సీపై నిషేధాన్ని విధించింది. నిబంధనలకు అనుగుణంగా సదరు ఏజెన్సీ పనిచేయకపోవడంతో సస్పెండ్ చేయాలని వాడా ఫౌండేషన్ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
కాగా తమ దేశ అథ్లెట్ల సమాఖ్యపై నిషేధాన్ని సవాల్ చేస్తూ రష్యా ఒలింపిక్ కమిటీ స్విట్జర్లాండ్లోని క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా రష్యాకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆ దేశ క్రీడాకారులు రియో ఒలింపిక్స్ కు దూరం కానున్నారు. అయితే రష్యా అథ్లెట్లపై స్పోర్ట్స్ కోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై ఇంటర్నేషన్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.