లంకకు వరుణుడి తోడు | Sri Lanka win by 27 runs via D/L method; enter final | Sakshi
Sakshi News home page

లంకకు వరుణుడి తోడు

Published Fri, Apr 4 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM

లంకకు వరుణుడి తోడు

లంకకు వరుణుడి తోడు

టి20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక
 డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 27 పరుగులతో వెస్టిండీస్‌పై గెలుపు
 
 ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 పగ తీరింది... లెక్క సరిపోయింది.... రెండేళ్ల క్రితం స్వదేశంలో ఫైనల్లో తమను ఓడించి టైటిల్‌కు దూరం చేసిన వెస్టిండీస్‌పై శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. జట్టంతా సమయోచితంగా రాణించడంతో పాటు... వరుణుడు సహకరించడంతో గత ఏడాది రన్నరప్ శ్రీలంక అలవోక విజయంతో టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. షేరే బంగ్లా స్టేడియంలో గురువారం జరిగిన తొలి సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌పై లంక డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 27 పరుగులతో గెలిచింది.
 
 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), దిల్షాన్ (39 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్సర్) మంచి ఆరంభాన్నిచ్చినా... సంగక్కర (1), జయవర్ధనే (0) విఫలమయ్యారు. తిరిమన్నె (35 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూస్ (23 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో లంకకు గౌరప్రదమైన స్కోరు లభించింది. వరుస వికెట్లతో ఓ దశలో శ్రీలంక తడబడ్డా.. చివరి ఓవర్లలో మాథ్యూస్ అద్భుతంగా ఆడాడు.  
 
 వెస్టిండీస్ జట్టు 13.5 ఓవర్లలో 4 వికెట్లకు 80 పరుగులు చేశాక భారీ వర్షం ముంచెత్తింది. స్మిత్ (14 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్సర్) వేగంగా ఆడటంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ధాటిగా మొదలైంది. అయితే మలింగ ఐదు బంతుల వ్యవధిలో స్మిత్‌తో పాటు గేల్‌ను బౌల్డ్ చేశాడు. సిమ్మన్స్ (4) కూడా విఫలం కావడంతో విండీస్ 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శామ్యూల్స్ (29 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్), బ్రేవో (19 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి ఇన్నింగ్స్‌ను సరిదిద్దే ప్రయత్నం చేశారు. బ్రేవో అవుటై... స్యామీ క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే వడగళ్లతో కూడిన భారీవర్షం మొదలైంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అప్పటికీ విండీస్ గెలవాలంటే 108 (పార్ స్కోరు 107)  పరుగులు చేయాలి. కానీ 80 పరుగులు మాత్రమే చేసింది.
 
 స్కోరు వివరాలు
 శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (బి) సాంటోకీ 26; దిల్షాన్ రనౌట్ 39; జయవర్ధనే రనౌట్ 0; సంగక్కర (సి) అండ్ (బి) బద్రీ 1; తిరిమన్నె (సి) సిమ్మన్స్ (బి) సాంటోకీ 44; మాథ్యూస్ (సి) బ్రేవో (బి) రస్సెల్ 40; ప్రసన్న నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160.
 
 వికెట్ల పతనం: 1-41; 2-41; 3-49; 4-91; 5-121; 6-160.
 బౌలింగ్: బద్రీ 4-0-23-1; సాంటోకీ 4-0-46-2; నరైన్ 4-0-20-0; శామ్యూల్స్ 4-0-23-0; రస్సెల్ 3-0-37-1; గేల్ 1-0-9-0.
 
 వెస్టిండీస్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (బి) మలింగ 17; క్రిస్ గేల్ (బి) మలింగ 3; సిమ్మన్స్ ఎల్బీడబ్ల్యు (బి) ప్రసన్న 4; శామ్యూల్స్ నాటౌట్ 18; డ్వేన్ బ్రేవో (సి) జయవర్ధనే (బి) కులశేఖర 30; స్యామీ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (13.5 ఓవర్లలో 4 వికెట్లకు) 80.
 వికెట్ల పతనం: 1-25; 2-28; 3-34; 4-77. బౌలింగ్: కులశేఖర 2.5-0-23-1; సేనానాయకే 2-0-6-0; మలింగ 2-0-5-2; హెరాత్ 4-0-27-0; ప్రసన్న 2-0-15-1; మాథ్యూస్ 1-0-4-0.
 
 షేమ్ షేమ్.. శ్రీలంక
 శ్రీలంక తమ కెప్టెన్ చండీమల్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం లేదని ప్రకటించింది. అతను టి20లకు సరిపోడట! అలాంటప్పుడు అతడిని జట్టుకు ఎంపిక చేయడం ఎందుకు? ఒకవేళ చేసినా... కెప్టెన్‌ను చేయాల్సిన అవసరం ఏమిటి?  భవిష్యత్ కోసం అంటూ చండీమల్‌ను టీ20లకు కెప్టెన్‌ను చేశారు. కానీ దారుణంగా అవమానించారు. దీంతో అతను చాలా బాధపడ్డాడు. తాను మ్యాచ్ ఆడటం లేదని బుధవారం రాత్రి తెలియగానే భోరును విలపించాడట. లంక బోర్డుతో కాంట్రాక్టు వివాదం, సీనియర్ల మద్దతు లేకపోవడం వల్ల చండీమల్ అవమానం పాలయ్యాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement