![‘రియో’ తర్వాత వీడ్కోలు: బోల్ట్](/styles/webp/s3/article_images/2017/09/1/71378324708_625x300.jpg.webp?itok=RqILTRXM)
‘రియో’ తర్వాత వీడ్కోలు: బోల్ట్
బ్రస్సెల్స్: అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే అథ్లెటిక్స్ కెరీర్‌కు వీడ్కోలు పలకాలనుందని 100, 200 మీటర్ల ప్రపంచ చాంపియన్ ఉసేన్ బోల్ట్ తెలిపాడు. డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో పోటీపడేందుకు ఇక్కడకు వచ్చిన బోల్ట్ తన భవిష్యత్‌పై మాట్లాడాడు. ‘2016 రియో ఒలింపిక్స్‌లోనూ స్వర్ణ పతకాలు సాధించాలని ఉంది. ఆ తర్వాత రిటైర్‌మెంట్ గురించి ఆలోచిస్తాను. నేను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటాను. నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను.
రిటైర్‌మెంట్‌కు అదే మంచి సమయమని భావిస్తున్నాను’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు. ‘మహ్మద్ అలీ, పీలే లాంటి దిగ్గజాల సరసన నా పేరూ చేరాలంటే అత్యున్నతస్థాయిలో ఉన్నపుడే ఆటకు గుడ్‌బై చెప్పాలి. వచ్చే ఏడాది గొప్ప ఈవెంట్స్ లేవు. స్కాట్లాండ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనాలో వద్దో నా కోచ్ నిర్ణయిస్తారు. 9.58 సెకన్లతో ఉన్న 100 మీటర్ల ప్రపంచ రికార్డును తిరగరాయడం చాలా కష్టం. అయితే గాయాలబారిన పడకుండా, మంచి ఫిట్‌నెస్‌తో ఉంటే 19.19 సెకన్లతో ఉన్న 200 మీటర్ల ప్రపంచ రికార్డును మెరుగుపర్చగలననే విశ్వాసం ఉంది’ అని బోల్ట్ తెలిపాడు.