- ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్ కేసు ..
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ?
- నేడు అధికారికంగా ప్రకటించనున్న పోలీసులు
బెంగళూరు : ఇక్కడి జాలహళ్లి మెయిన్ రోడ్డులోని ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్‌లో చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తిని బెంగళూరు సీసీబీ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆ స్కూల్లో అటెండర్‌గా పని చేస్తున్న గుండన్న అలియాస్ గుండప్పను పోలీసులు దోషిగా గుర్తించినట్లు తెల్సింది. గత మంగళవారం ఆర్కిడ్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న మూడున్నర సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం జరిగిందని పోలీసులు బుధవారం కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.
ఆ కేసుకు సంబంధించి ఆర్కిడ్ స్కూల్‌లో పని చేస్తున్న అందరినీ పోలీసులు విచారణ చేశారు. గుండన్నను గురువారం రాత్రి సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం సాయంత్రం వైద్య నివేదికలు అందడంతో గుండన్నను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
నేటి నుంచి స్కూల్ ..
ఆ స్కూల్‌లో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలీసు అధికారులు అలోక్‌కుమార్, అభిషేక్ ఘోయల్, సురేష్, ఆర్కిడ్ స్కూల్ చైర్మన్ వెంకటనారాయణరెడ్డి, విద్యార్థుల కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సభ్యులు (14 మంది), కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సోమవారం నుంచి స్కూల్ ప్రారంభించాలని పలువురు విద్యార్థుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. లేకుంటే తమ పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సోమవారం నుంచి స్కూల్ ప్రారంభించడానికి స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల కుటుంబ సభ్యులు నిర్ణయించారు. విద్యార్థుల పూర్తి భ ద్రతకు యాజమాన్యం బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఎం.ఎన్. రెడ్డి మాట్లాడుతూ.. స్కూల్‌లో పలు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి స్కూల్ వ్యాన్‌లో మహిళా టీచర్ లేదా ఆయాను పెట్టాలని సూచించామని అన్నారు.
అనుమతి లేదు..
నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీ, ఆరు, ఏడో తరగతుల నిర్వహణకు విద్యాశాఖ అధికారి బీఈఓ నుంచి ఈ స్కూల్ యాజమాన్యం ఎలాంటి అనుమతి తీసుకోలేదని వెలుగు చూసింది. అర్కిల్ స్కూల్ విద్యాభ్యాసం చేస్తున్న 952 మంది విద్యార్థుల కుటుంబ సభ్యులను మోసం చేశారని ఆరోపిస్తూ కేఆర్‌కే రెడ్డి, పాఠశాల హెడ్‌మాస్టర్ కే దుర్గా, స్కూల్ ఉపాధ్యక్షురాలు వై శిల్ప, ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబుపై కేసులు నమోదు చేశామని డీసీసీ సురేష్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన ఆర్కిడ్ స్కూల్ యాజమాన్యం శ్రీ గౌతమ్ అకాడమి ఆఫ్ జనరల్ అండ్ టెక్నాలజి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఈ విద్యా సంస్థను నిర్వహిన్నారని తెలిపారు.