బతుకు భాగ్య ఏదీ? | Bhagya's life there? | Sakshi
Sakshi News home page

బతుకు భాగ్య ఏదీ?

Published Tue, Jan 28 2014 3:20 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

Bhagya's life there?

ప్రజల కోసం అంటూ పలు ‘భాగ్య’ పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం మొదట ‘బతికు భాగ్య’ను కల్పించాలని ప్రభుత్వాన్ని సదానందగౌడ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న అశాంతియుత వాతవరణాన్ని ఆయుధంగా చేసుకుని తన పదునైన వ్యంగాస్త్రాలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు.  
 
 మంత్రి కిమ్మెనకు  ప్రశంశలు

 తొలిసారిగా పరిషత్‌లో విపక్షాల నుంచి రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ ప్రశంసలు అందుకున్నారు. అసలేం జరిగిందంటే శనివారం పరిషత్‌లో సమావేశాలు జరిగే సమయంలో కోలారులోని ప్రభుత్వ మాధ్యమిక, జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల కొరతను మంత్రి కిమ్మెన దృష్టికి బీజేపీ ఎమ్మెల్సీ లీలా తీసుకువచ్చారు. దీంతో అదేరోజు సాయంత్రం కళాశాలను సందర్శించిన మంత్రి, అక్కడి పరిస్థితిని గమనించి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు విడుదల చేస్తూ అప్పటికప్పుడు ఆదేశాలు జారీచేయడమే కాకుండా బాలురు, బాలికల కళాశాలల మధ్య ప్రహరీ నిర్మించడానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సోమవారం ప్రశ్నోత్తర సమయం తర్వాత సభపతి శంకరమూర్తి అనుమతితో కిమ్మెన రత్నాకర్‌ను ఎమ్మెల్సీ లీలా అభినందించారు. ఇందుకు పార్టీలకతీతంగా అందరు ఎమ్మెల్సీలు కరతాళ ధ్వనులు చేశారు.
 
మొదట ‘బతుకుభాగ్య’ కల్పించండి
 
రాష్ట్రంలో అన్నభాగ్య, క్షీరభాగ్య అంటూ పలు పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వం, సామాన్యులకు బతుకు భాగ్య కల్పించడం లేదని పరిషత్ విపక్షనాయకుడు సదానందగౌడ విమర్శించారు.  రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం గురించి మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయన్నారు.  ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల రాాష్ట్రంలో ఉగ్రవాదులు, మావోయిస్టుల చర్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు హోంశాఖ మంత్రి జార్జ్ స్పందిస్తూ తమ హయాంలోనే శాంతిభద్రతలు బేషుగ్గా ఉన్నాయని సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా పరిషత్‌లో కొంతసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. పరిషత్ అధ్యక్షుడు శంకరమూర్తి కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమునిగింది.
 
‘అన్నభాగ్య’ దొంగలపై గూండాయాక్ట్ తీసుకురండి
 
‘అన్నభాగ్య’ పేరుతో పేదలకు అందిస్తున్న బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై గూండాయాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉందని జేడీఎస్ ఎమ్మెల్సీ నాణయ్య సూచించారు. పేదలకు అందాల్సిన సంక్షేమపథకాలు కొందరి స్వార్థం వల్ల పక్కదారి పడుతున్నాయని అన్నారు. ఇందుకు మంత్రి  దినేష్‌గుండూరావ్ స్పందిస్తూ... ఈ విషయమై హోంశాఖ అధికారులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  అన్నభాగ్యలో అక్రమాలను నిరోధించడానికిగాను ప్రతి నెలా ఒకటి నుంచి పదోతారీకు వరకూ కచ్చితంగా రేషన్‌షాపుల్లో వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచాలనే నిబంధన తేనున్నామని మంత్రి పునరుద్ఘాటించారు. అదేవిధంగా గోదాముల్లో ఎలక్ట్రానిక్ త్రాసులు, సీసీకెమరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
 
పన్ను వల్ల పర్యాటకం తగ్గడం లేదు
 
పర్యాటకులను తీసుకువచ్చే 12+1 సీటింగ్ సామర్థ్యం ఉన్న వాహనాలపై ప్రభుత్వం విధిస్తున్న పన్నువల్ల పర్యాటకుల సంఖ్య తగ్గుతోందనడం వాస్తవదూరమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి పరిషత్‌కు వెల్లడించారు. ఎమ్మెల్సీ మానప్ప భండారి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 12+1 సీటింగ్ సామర్థ్యం ఉన్న వాహనాలకు మూడు నెలలకు గాను ఒక్కొక్క సీటుకు రూ.3053లను పన్నుగా వసూలు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే రాష్ట్రంలో పన్ను తక్కువగా ఉందని అయితే కేరళ, మహారాష్ట్రతో పోల్చుకుంటే పన్ను ఎక్కువగా ఉన్నమాట వాస్తవమన్నారు. అయితే వారం, నెల కాక ఒక రోజు కోసం పర్యాటక శాఖతో అనుమతి తీసుకుని రాష్ట్రంలోకి పర్యాటకులను తీసుకువస్తున్న వాహనాలపై పన్ను ఎక్కువగా వసూలు చేస్తున్నమాట వాస్తవమని సంబంధిత అధికారులతో చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరగదు
 
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ బేస్‌పై పనిచేస్తున్న వారిని ప్రభుత్వోద్కోగులుగా గుర్తించడం వీలుకాదని రాష్ట్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖ మంత్రి యు.టి.ఖాదర్ స్పష్టంచేశారు. అయితే పదేళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నవారికి 60 ఏళ్లు వచ్చేవరకూ అదే స్థానంలో కొనసాగించడంతో పాటు  కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉందన్నారు. ఎమ్మెల్సీ కోటాశ్రీనివాసపూజారి అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో 1,457 గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్ తదితర పీజీ చదివిన  వైద్యుల కొరత ఉందన్నారు. సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందన్నారు.
 
కుల వివక్ష ఇంకా ఉంది ?
 
‘సమాజంలో కుల వివక్ష ఇంకా ఉంది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన వ్యక్తులకు అద్దెకు ఇళ్లు ఇవ్వడానికి ఇతర వర్గాల వారు ఇప్పటికీ సుముఖంగాలేరు.  దావణగెరెలో స్వయానా నా సోదరికి అద్దెకు ఇళ్లు దొరకలేదు అంటే అక్కడ కుల వివక్ష ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని  రాష్ట్ర సాంఘిక  సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ వాపోయారు. ఎమ్మెల్సీ అరుణ్‌శహపూరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి పై విధంగా పేర్కొన్నారు. ‘విద్యాసిరి’ పథకాన్ని ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు విస్తరించే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉందని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement