న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలనగానే నిన్నామొన్నటిదాకా అందరికీ కాంగ్రెస్ పార్టీనే మదిలో మెదిలేది. ఇక ఇప్పుడుప్రతిపక్ష బీజేపీలోనూ వారసత్వ రాజకీయ పోరు ప్రారంభమైంది. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో పలువురు బీజేపీ నాయకులు కూడా కొడుకులను రాజకీయ రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ అగ్ర నాయకులు కుటుంబ సభ్యులకు టికె ట్లను దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రితోపాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా తమ వారసులను రంగంలోకి తీసుకొచ్చేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. ఈ ప్రయత్నాలను పసిగట్టిన రెండో శ్రేణి నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడం ప్రారంభించారు. ఈసారి ఎన్నికల బరిలో నిలవాలని కలలుగంటున్న ఈ నాయకులు ఇప్పటికే పార్టీ తరఫున అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ‘‘గడిచిన మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను వారసత్వ రాజకీయాల పార్టీగా అధినాయకుల నుంచి వీధి నాయకుల వరకు దుమ్మెతి పోశాం. ఇప్పుడు మా పార్టీ అదే దారిలో నడుస్తోంది.’ అని పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న బీజేపీ నాయకుడొకరు విమర్శించారు.
‘‘సూత్రబద్ధ రాజకీయాలకు కట్టుబడే పార్టీగా పేరుపడి బీజేపీలో ఇప్పుడు ఆ నిబంధనలు నీరుగారిపోతున్నాయి. అగ్ర నాయకుల కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వడాన్ని పార్టీలో అన్నిస్థాయిల్లో చర్చ లేవనెత్తుతాం’’ అని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ తనయుడు ప్రవేశ్ వర్మ, మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా తనయులు విమల్, హరీశ్ ఖురానా, ప్రస్తుత ఎమ్మెల్యే ఓపీ బబ్బర్ తనయుడు రాాజీవ్‌బబ్బర్, ఎమ్మెల్యే హెచ్‌ఎస్ బల్లీ భార్య ప్రస్తుత ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వారి అభ్యర్థిత్వాలను ఖరారు చేయించుకునేందుకు తండ్రులు తీవ్ర ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నారు. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు వీకే మల్హోత్రా తనయుడు అజయ్ మల్హోత్రా, జనక్‌పురి శాసనసభ్యుడు జగదీశ్ ముఖీ తనయుడు అతుల్ ముఖి, సాహెబ్ సింగ్ వర్మ సోదరుడు ప్రస్తుత ఉత్తర ఢిల్లీ మేయర్ ఆజాద్‌సింగ్ కూడా టికెట్ ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. సాహెబ్‌సింగ్ వర్మ దివంగతులవగా మరో మాజీ ముఖ్యమంత్రి సీఎం ఖురానా పడక మంచానికే పరిమితమయ్యాడు.
మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ తనయుడు ప్రవేశ్ వర్మ కన్ను షాలీమార్‌బాగ్ నియోజక వర్గంపై పడింది. ఖురానా కుమారులు మోతీనగర్ సీటును దక్కించుకోవాలనిచూస్తున్నారు. ఇక్కడి నుంచి వారి తండ్రి వరుస విజయాలు సాధించారు. రెండు నియోజక వర్గాలు బీజేపీకి పెట్టని కోటలని ప్రతీతి. ప్రస్తుతం ఢిల్లీ శాసనసభలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా బీజేపీలోని ఈ పరిణామాలను పార్టీ అంతర్గత వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అగ్ర నేతల కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెడితే కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసినట్లవుతుందని అంటున్నారు. పార్టీ కోసం శ్రమించిన వారు పార్టీ సిద్ధాంత కట్టుబాటును శంకించే పరిస్థితి వస్తుందని అంటున్నారు. ‘‘మా ప్రధాని అభ్యర్థి రాజకీయాల్లో కాంగ్రెస్ సంస్కృతిని తుడిచిపెట్టాలని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఒక వేళ ఇప్పుడు అగ్ర నాయకుల వారసులకుు టికెట్లు ఇచ్చి అభ్యర్థులను చేస్తే పార్టీది రెండు నాల్కల ధోరణి అవుతుంది తప్ప మరేమీు కాదు. దీన్ని పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి’’ అని ఓ సీనియర్ నాయకుడు తీవ్రంగా విమర్శించారు.
కమల దళంలోనూ ‘వార్’సత్వం
Published Tue, Nov 12 2013 12:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement