సాక్షి, ముంబై: వాణిజ్య సంస్థలు, రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే బ్యానర్లు, ఫ్లెక్సీల ద్వారా అదనపు ఆదాయం పొందేందుకు బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కార్పొరేటర్ల సూచనలతో మెట్రో, మోనో రైలు మార్గం పిల్లర్లపై బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేసేందుకు అనుమతినిస్తే బీఎంసీ ఖజానాకి అదనపు ఆదాయం వస్తుందని వారు భావిస్తున్నట్లు తెలిసింది. బహిరంగ ప్రదేశాల్లో అక్రమంగా ఏర్పాటు చేసే వాణిజ్య ప్రకటనలు, నాయకుల పుట్టిన రోజు వేడుకల ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులను బీఎంసీ నిషేధించింది. దీంతో వాణిజ్య, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు మెట్రో, మోనో రైల్వే మార్గం లోని పిల్లర్లపై దృష్టి సారించాయి.
ఇప్పటికే అక్రమంగా పిల్లర్లపై హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో బీఎంసీకి రావల్సిన అదనపు ఆదాయానికి గండిపడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్పొరేటర్లు బ్యానర్లకు అధికారికంగా అనుమతినిచ్చి ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని బీఎంసీ పరిపాలన విభాగానికి సూచించారు.
ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, హోర్డింగులే..
ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల వల్ల నగరం విృతంగా మారిపోయింది. దీంతో చేసేది లేక బ్యానర్ల ఏర్పాటును బీఎంసీ నిషేధించింది. అనుమతి పొందిన వారు రుసుం చెల్లించి, నియమాలకు లోబడి పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే డబ్బు చెల్లించాల్సి వస్తుందని అనేక వాణిజ్య సంస్థలు, రాజకీయ పార్టీలు మెట్రో రైల్వే పిల్లర్లను ఆశ్రయించడం మొదలు పెట్టాయి. అధికారికంగా బ్యానర్లు హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటు సంబంధించిన ప్రక్రియను ఏదైనా సంస్థకు కాంట్రాక్టుకు ఇవ్వాలని కార్పొరేటర్లు బీఎంసీ పరిపాలనా విభాగానికి సూచించారు. ఈ ప్రతిపాదనకు బీఎంసీ సభలో మంజూరు లభించగానే అమలు చేయనున్నట్లు సమాచారం.
‘ప్రచారానికి’ గ్రీన్ సిగ్నల్..?
Published Thu, May 7 2015 3:51 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement