సాక్షి, ముంబై:
నగరంలో ఓటర్ల సంఖ్య తగ్గింది. దీంతో రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. 2009లో బహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) హద్దులో 98,92,124 ఓటర్లు ఉన్నారు. ఒక్క ముంబైలోనే 26,87,166 ఓటర్లుండగా శివారు ప్రాంతాల్లో 72,04,958 ఉన్నారు. అదే ఈ ఏడాది రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది జాబితా ప్రకారం బీఎంసీ హద్దులో 94,01,139 ఓటర్లు ఉన్నారు. అంటే ప్రస్తుతం 4,90,985 ఓట్లు తగ్గినట్లు స్పష్టమవుతోంది. తగ్గిన వారిలో నగరానికి చెందిన 3,20,332 మంది ఓటర్లుండగా, శివారు ప్రాంతాలకు చెందినవారు 1,70,653 మంది ఉన్నారు.
నగరంలో స్థలాలు, ఇళ్ల ధరలు సామాన్యులకే కాదు..మధ్య తరగతి వారికి కూడా ఏమాత్రం అందనంత ఎత్తులో ఉన్నాయి. దీంతో చాలామంది నగర శివారు ప్రాంతాలకు తరలిపోయారు. కాగా ఠాణే జిల్లాలో 68,04,663 ఓటర్లు ఉన్నారు. గతం కన్నా ఈసారి జిల్లాలో లక్ష మేర ఓటర్ల సంఖ్య పెరగడం గమనార్హం. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల తుదిజాబితాను బట్టి తెలుస్తోంది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో 7,62,76,612 మంది ఓటర్లు ఉండగా ఇందులో 3,57,98,019 మంది మహిళా ఓటర్లు. 2009లో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7,57,67,279 ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. దీన్ని బట్టి రాష్ట్రవ్యాప్తంగా 5,09,333 ఓటర్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.
ముంబైలో తగ్గిన ఓటర్లు
Published Thu, Sep 19 2013 11:21 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement