మండ్య, న్యూస్‌లైన్ : చమురు శుద్ధి కేంద్రంలో బాయిలర్ రియాక్టర్‌ను శుభ్రం చేస్తున్న అయిదుగురు కార్మికులు ఊపిరాడక మృత్యువాత పడ్డారు. తాలూకాలోని తూబినకెరె పారిశ్రామిక వాడలో గురువారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను బీహార్‌కు చెందిన గామ (37), బబ్లూ (26), శ్రీరామ (25), చేతు (24), రాజు (27)లుగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన బెంగళూరు నివాసులు సంపత్, అరుణ్‌లు ఇక్కడ సంపత్ రీఫైనరీ పేరిట నాలుగేళ్లుగా చమురు శుద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందులో 15 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో బీహార్‌కు చెందిన తొమ్మిది మంది ఉన్నారు. మైసూరు, మండ్య సహా వివిధ జిల్లాల్లో యంత్రాలు, వాహనాల నుంచి తొలగించిన వ్యర్థ చమురును లీటరు రూ.5 చొప్పున కొనుగోలు చేసి రోజూ ఈ కర్మాగారంలో శుద్ధి చేస్తారు. రోజూ 30 (ఆరు వేల లీటర్లు) బ్యారెళ్లను ఉత్పత్తి చేస్తారు. దీనికి సుమారు పది వేల లీటర్ల ముడి చమురు అవసరం.
నెలలో 15 రోజులు మాత్రమే కర్మాగారం పని చేస్తుంది. మిగిలిన 15 రోజులు యంత్రాలను శుభ్రం చేస్తుంటారు. అదే మాదిరి ఉదయం పది గంటలకు 25 అడుగుల ఎత్తై బాయిలర్ రియాక్టర్‌ను శుభ్రం చేయడానికి బబ్లూ కిందికి దిగాడు. కొద్ది సేపటికి అతను కింద పడి కొట్టుకోవడాన్ని గమనించిన మరో కార్మికుడు కిందికి దిగాడు. అలా ఒకరి వెనుక ఒకరు...అయిదుగురు లోనికి దిగేశారు.వారికి ఎయిర్ కంప్రెసర్ ద్వారా ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు ఉన్నాయి.
అందులో ఏదో లోపం ఏర్పడడంతో ఊపిరాడక కింద పడిపోయారు. పైన ఉన్న మిగిలిన కార్మికులు అనుమానంతో గట్టిగా కేకలు వేస్తూ వారిని పిలిచారు. అటు వైపు నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఫైరింజన్ సిబ్బందిని పిలిపించారు. లోపల ఉన్న వారిని రక్షించడానికి బాయిలర్‌ను ముక్కలుగా కత్తిరించడానికి మైసూరు నుంచి ప్రత్యేక దళాన్ని రప్పించారు. ఆ దళం రావడానికి గంటకు పైగా పట్టింది.
బాయిలర్‌ను కత్తిరించడానికి రెండున్నర గంటలకు పైగా పట్టింది. అప్పటికే నలుగురు మరణించారు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న చేతుకు అక్కడే ఉన్న అంబులెన్స్‌లో వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎస్‌పీ అజయ్ నాగభూషణ్, ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కర్మాగారం యజమానులపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్‌పీ తెలిపారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని, పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని బెంగళూరుకు పంపించామని ఆయన వెల్లడించారు.
మృత్యుకుహరమైన బాయిలర్
Published Fri, Mar 7 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement
Advertisement