శ్రీశైలంలో భక్తుల రద్దీ
700 పైగా సామూహిక అభిషేకాలు
- 55పైగా గర్భాలయ రుద్రాభిషేకాలు
- ఆలయ పూజావేళల్లో మార్పు
- పాతాళగంగలో పుణ్యస్నానాలు–కార్తీక దీపారాధనలు
శ్రీశైలం: కార్తీకమాసం.. శివునికి అత్యంత ప్రీతికరమైన నాలుగవ సోమవారం జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలం భక్తజన సంద్రంగా మారింది. సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. కాగా భక్తుల రద్దీ నేపథ్యంలో ఈఓ నారాయణభరత్ గుప్త వేకువజామున 2గంటలకు మంగళవాయిద్యాలు, 2.30 గంటలకు సుప్రభాతం, 3గంటలకు మహామంగళహారతి, 3.30గంటల నుంచి దర్శన ఆర్జిత సేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు వేకువజామున 2గంటల నుంచే పాతాళగంగ మెట్ల మార్గంలో నదీ తీరం చేరుకుని పవిత్ర కార్తీక స్నానాలను నిర్వహించుకున్నారు. 3.30గంటల నుంచే దర్శనాలు ప్రారంభం కావడంతో ఉచిత ప్రత్యేక దర్శన క్యూలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులతో కిక్కిరిసి కనిపించాయి. అలాగే అభిషేక ప్రియుడైన శ్రీ మల్లికార్జున స్వామివార్లకు సామూహిక అభిషేకాలను నిర్వహించుకోవడానికి భక్తులు వందల సంఖ్యలో టికెట్లను కొనుగోలు చేశారు. ఆన్‌లైన్, ఒకరోజు ముందస్తు టికెట్లు, కరెంట్ బుకింగ్ ద్వారా సుమారు 750 పైగా అభిషేకం టికెట్లను విక్రయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే స్వామివార్ల గర్భాలయంలో జరిగే శాస్త్రోక్త మంత్రపూరిత రుద్రాభిషేకానికి సైతం భక్తులు రూ.5వేల టికెట్ ఖర్చుకు వెనుకాడకుండా 55 పైగా అభిషేకాలను నిర్వహించుకున్నారు.
కార్తీక దీపారాధనలు– వ్రతనోములు
కార్తీకమాసం నాలుగవ సోమవారం సందర్భంగా ప్రధాన మాడా వీధుల్లోని రథశాల వద్దనున్న గంగాధర మండపం చుట్టూ వందల సంఖ్యలో భక్తులు పవిత్ర పుణ్య స్నానాలాచరించుకుని కార్తీక దీపారాధనలు, వ్రతనోములను శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట, ఉసిరిచెట్ల సముదాయం వద్ద మల్లన్న దర్శనానంతరం భక్తులు కార్తీక దీపాలను వెలిగించి ఉపవాస దీక్షలను విరమించారు.
లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల్లో భక్తుల రద్దీ
స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం భక్తులు అమ్మవారి ఆలయం వెనుకనున్న లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద లడ్డూ, పులిహోర ప్రసాదాల కోసం బారులు తీరారు. గతంలో అమ్మవారి ఆలయం వెనుక రెండు ప్రసాదాల విక్రయ కేంద్రాలు ఉండేవి. అయితే ఇటీవల ఎస్‌బీహెచ్ నిర్వహించే ఒక ప్రసాద విక్రయ కేంద్రాన్ని ల్యాండ్ స్కేపింగ్ కోసం కూల్చి వేయడంతో ఉన్న ఒక్క ప్రసాద విక్రయ కేంద్రం వద్ద భక్తుల తాకిడి పెరిగి క్యూలన్నీ పోటెత్తాయి.