సాక్షి, ముంబై: మలబార్ హిల్‌లో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ హోమీ బాబా నివాసం ‘మెహెరాంగీర్’ బంగ్లాను వేలంలో విక్రయించకుండా న్యూక్లియర్ కమిషన్ ఉద్యోగులు ముందుకు వచ్చారు. ఈ బంగ్లా విక్రయాన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు లక్షా మంది సిబ్బంది తమ రెండు రోజుల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మెహెరాంగీర్ బంగ్లాను న్యూక్లియర్ డిపార్ట్‌మెంట్ ఆధీనంలోకి తీసుకుని, దాని నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాతో న్యూక్లియర్ కమిషన్ సిబ్బంది సంప్రదింపులు జరిపారు.
కాగా, ఈ బంగ్లా మొత్తం 1,593 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రతీ చదరపు మీటరు స్థలం సుమారు రూ.1.50 లక్షల ధర పలకనుంది. ఈ ప్రకారం మొత్తం బంగ్లా రూ.270 కోట్లకు నేషనల్ సెంటర్ ఫర్ ది పర్‌ఫామింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ) విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ప్రముఖ శాస్త్రవేత్తలో ఒకరైన డాక్టర్ హోమీ బాబా 1966లో చనిపోయారు. అనంతరం హోమీ బాబా సోదరుడు, ఎన్‌సీపీఏ సంస్థాపకుడు, టాటా గ్రూపు మాజీ అధికారి జమ్‌షెడ్ బాబా ఆధీనంలోకి ఆ బంగ్లా అధికారాలు వచ్చాయి. 2007లో జమ్‌షెడ్ బాబా కూడా చనిపోవడంతో ఆ బంగ్లా పూర్తి అధికారాలు ఎన్‌సీపీఏ చేతుల్లోకి వచ్చాయి.
ఇప్పుడు ఆ బంగ్లాను ఎన్‌సీపీఏ విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ నోటీసు కూడా ఇటీవలే జారిచేసింది. ప్రస్తుతం మార్కెట్ ధరను బట్టి ప్రతీ చదరపు మీటరుకు రూ.1.45 లక్షల చొప్పున అమ్ముతామని ప్రకటన ఇచ్చింది. అయితే పోటీదారుల వల్ల దీని ధర ఏకంగా రూ.270 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. అయితే దీన్ని విక్రయించకుండా అడ్డుకోవాలని నూక్లియర్ కమిషన్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకు అవసరమైన డబ్బును ఎన్‌సీపీఏకు చెల్లించి, ఆ బంగ్లాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
హోమీబాబా బంగ్లా అమ్మొద్దు
Published Wed, Apr 9 2014 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
Advertisement
Advertisement