సోమరులుగా మారుస్తున్నారు.!
అన్నభాగ్యతో ప్రజలను పనికిరానివాళ్లుగా మారుస్తున్న ప్రభుత్వం
ఆకలి రహిత రాష్ట్రం కాదు అప్పుల కర్ణాటక
జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి
బెంగళూరు : ప్రభుత్వ పథకాలు ప్రజా సంక్షేమానికి దోహపడేలా ఉండాలే కాని ప్రజలను సోమరులను చేసేలా ఉండరాదని జేడీఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి విమర్శించారు. హుబ్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలను సోమరులుగా చేసేందుకే ఉచితంగా ఆహార ధాన్యాలను ప్రభుత్వం అందజేస్తోందని అన్నారు. దీని ఫలితంగా రాష్ట్రం మానవ వనరులు లభ్యం కాక ఉత్పాదకత సామర్థ్యం తగ్గి అభివృద్ధి విషయంలో కర్ణాటక తిరోగమనంలో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార ధాన్యాలను ఉచితంగా వితరణ చేస్తున్నామంటూ గొప్పలు పోతున్న ప్రభుత్వం గతంలో ఒక్కొక్క కుటుంబానికి ఇస్తున్న ఆహార ధాన్యాల పరిమాణాన్ని ఎందుకు తగ్గించిందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలు అన్నం తినగలుగుతున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ రాష్ట్ర ప్రజలు ఉపవాసం ఉండేవారా? అంటూ ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకునే సిద్ధరామయ్య పాలనలో దానిమ్మ రైతులు దయా మరణం కోరుతూ గవర్నర్‌కు అర్జీలు దాఖలు చేసుకోవడం శోచనీయమని అన్నారు. ఈ విషయంలో సిద్ధు సిగ్గుపడాలని అన్నారు. రాష్ట్ర రైతుల పై ఏమాత్రం గౌరవమున్నా దానిమ్మ పంటవేసి నష్ట పోయిన వారికి పరిహారం అందించడానికి వీలుగా వెంటనే రూ.335 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన రుణం కంటే అభివృద్ధి పేరుతో సిద్ధరామయ్య ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ‘ఆకలి రహిత కర్ణాటక కాదు అప్పుల కర్ణాటక’గా రాష్ట్రం పేరుతెచ్చుకోవడం కచ్చితమని కుమారస్వామి జోష్యం చెప్పారు. బీబీఎంపీ విభజనకు జేడీఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోదన్నారు. పాలనా విషయంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోదీకి సలహాలు చెప్పడం మాని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచనలు ఇవ్వడం సబబుగా ఉంటుందని అన్నారు.