► చర్చలకు గ్రీన్ సిగ్నల్
► జాలర్ల నేతలు సమాయత్తం
► ఢిల్లీ వేదికగా సమాలోచన
► సుష్మాతో భేటీకి శ్రీలంక అధికారుల రాక
ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న తమిళ, శ్రీలంక జాలర్ల చర్చలు ఈ సారైనా ఫలితం ఇచ్చేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. రెండు దేశాల జాలర్లు, అధికార వర్గాలతో చర్చలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఇక్కడి జాలర్ల సంఘాల నేతలు సమాయత్తం అవుతున్నారు. ఢిల్లీ వేదికగా ఒకటి రెండు రోజుల్లో ఈ చర్చలు సాగే అవకాశాలు ఉన్నాయి. ఇక, ఐదు లేదా ఆరో తేదీన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో శ్రీలంక మత్స్య శాఖ మంత్రి నేతృత్వంలోని అధికారుల బృందం సమావేశం కానుంది.
సాక్షి, చెన్నై: కడలిలో తమిళ జాలర్లపై శ్రీలంక సేనలు సాగిస్తున్న దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులు చేయడం, బందీలుగా పట్టుకెళ్లడం, పడవల్ని తమ ఆధీనంలో ఉంచుకోవడం పరిపాటిగా మారింది. నెలల తరబడి జాలర్లు జైల్లో గడపాల్సిన పరిస్థితి. రెండు దేశాల మధ్య సత్సంబంధాల మెరుగు అంటూ పాలకులు ప్రకటించుకుంటున్నా, జాలర్లకు కడలిలో భద్రత మాత్రం లేదు. రెండు దేశాల జాలర్ల మధ్య చర్చలకు చర్యలు ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా ఆగి ఉన్నాయి. ఈ చర్చల ఆధారంగా పారంపర్యంగా చేపల్ని వేటాడుకుంటున్న ప్రాంతాల్లో వేట సులభతరం చేయడం, కొన్ని రకాల పడవల్ని ఉపయోగించుకునే విధంగా, రెండు దేశాల జాలర్ల మధ్య సత్సంబంధాల మెరుగుతో పాటుగా, పరస్పరం వేటకు తగ్గ కాల పరిమితి తదితర అంశాలను అమల్లోకి తీసుకొచ్చేందుకు తగ్గట్టు మార్గం సుగమం అవుతుందని సర్వత్రా ఎదురు చూస్తున్నారు.
ఆ మేరకు తొలి, మలి విడత చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాలపై ఇంత వరకు చర్యలు తీసుకున్న వారే లేదు. ఆ చర్చలన్నీ విఫలం అన్నట్టుగా పాలకుల తీరు ఉండటంతో తమిళ జాలర్లు దిన దిన గండంగా కడలిలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి. తమకు భద్రత కల్పించాలని పదే పదే నినదించినా, పోరు బాట సాగించినా, సమ్మె సైరన్ మోగించినా ఫలితం శూన్యం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు స్పందించేదెప్పుడో అని ఎదురు చూస్తూ వచ్చిన జాలర్ల సంఘాలకు శుభవార్త అందింది. రెండు దేశాల మధ్య చర్చలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, అందుకు తగ్గ ఏర్పాట్లపై దృష్టి పెట్టడం విశేషం. ఈ చర్చలు ఈ వారంలోనే జరిగేందుకు అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సారైనా.. ఫలితం దక్కేనా?
గతంలో చెన్నై వేదికగా, తదుపరి శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన చర్చలు బెడిసి కొట్టాయి. ఈ దృష్ట్యా, ప్రస్తుతం భారత రాజధాని నగరం ఢిల్లీ వేదికగా చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఇప్పటికే ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ , మత్స్య శాఖ వర్గాలతో కొలంబో వెళ్లి మరీ తమిళ జాలర్ల సమస్యపై చర్చించారు. తాజాగా అక్కడి జాలర్ల ప్రతినిధుల బృందం, ఆ దేశ మత్స్య శాఖ మంత్రి నేతృత్వంలోని అధికారుల బృందం ఢిల్లీ వచ్చి ఇక్కడి వర్గాలతో చర్చలకు సిద్ధం అయ్యాయి.
బుధవారం శ్రీలంక జాలర్ల బృందం భారత్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ మరుసటి రోజున తమిళ జాలర్లు, శ్రీలంక జాలర్ల ప్రతినిధుల చర్చలకు ఆస్కారం ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఐదో తేదీన సుష్మా స్వరాజ్ నేతృత్వంలో రెండు దేశాల జాలర్లు, అధికారుల సమాలోచనకు కసరత్తులు చేస్తున్నారు. ఈ చర్చలకు కేంద్రం చర్యలు చేపట్టి ఉన్న దృష్ట్యా, ఈ సారైనా తమ భద్రతకు భరోసా దక్కే విధంగా చర్చలు ఫలితాల్ని ఇవ్వాలన్న ఎదురుచూపుల్లో తమిళ జాలర్లు ఉన్నారు.
గతంలో శ్రీలంక జాలర్లు తమ ముందు ఉంచిన ప్రతిపాదనలు, తాము ఆ దేశం ముందు ఉంచిన ప్రతిపాదనలను మళ్లీ తెర మీదకు తీసుకు రావడంతో పాటుగా, రెండు దేశాల మధ్య చేపల వేటకు సంబంధించి పలు అంశాలపై చర్చలకు సమాయత్తం అవుతున్నారు. గతంలో చర్చలకు వెళ్లిన జాలర్ల ప్రతినిధులు, అధికారుల బృందమే మళ్లీ ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై మత్స్య శాఖ వర్గాలు పేర్కొంటూ, కేంద్రంలో చర్చలకు తగ్గ కసరత్తులు జరుగుతున్నాయని, పిలుపు రాగానే, ఢిల్లీకి బయల్దేరేందుకు సన్నద్ధం అవుతోన్నట్టు పేర్కొన్నారు. ఈ వారంలోపు చర్చలకు ఆస్కారం ఉందని వ్యాఖ్యానించారు.
ఫలితం దక్కేనా?
Published Tue, Nov 1 2016 3:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
Advertisement