సాక్షి, చెన్నై : రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తమ నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటులో కమలనాథుల పాత్ర ప్రశంసనీయం. చతికిలపడిన పార్టీకి ఆక్సిజన్ నింపడంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కీలక భూమిక పోషించారు. కష్ట కాలంలో పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టడంతోపాటుగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. మెగా కూటమిని ఏర్పాటు చేసి ప్రధాన ద్రవిడ పార్టీల్లో వణుకు పుట్టించే యత్నం చేశారు. ఎన్నికల్లో ఈ మెగా కూటమి అనేక చోట్ల మూడో స్థానానికి పరిమితం అయింది. కొన్ని స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులు డీఎంకేకు చుక్కలు చూపించారని చెప్పవచ్చు. కన్యాకుమారి, పుదుచ్చేరి, ధర్మపురిలో మాత్రం విజయ కేతనం ఎగుర వేశారు. పరువు దక్కించుకున్నా, జాతీయ స్థాయిలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం కూటమి మిత్రుల్లో ఆనందాన్ని నింపుతోంది.
పదవుల కోసం...: బీజేపీ 8 చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టినా, చివరకు కన్యాకుమారిలో మాత్రం గెలిచింది. గతంలో ఇక్కడి నుంచే పొన్ రాధాకృష్ణన్ పార్లమెంట్ మెట్లు ఎక్కారు. వాజ్ పేయ్ మంత్రి వర్గంలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ సహాయ మంత్రి పదవి ఆయన్ను వరించింది. ఇప్పుడు తన వ్యక్తిగత హవా, మోడీ ప్రభావంతో లక్షా 25 ఓట్ల ఆధిక్యంతో రాధాకృష్ణన్ గెలిచారు. అయితే, ఇక్కడ పోటీ అన్నది కాంగ్రెస్ అభ్యర్థి వసంత కుమార్, రాధాకృష్ణన్ మధ్య నెలకొనడంతో ప్రధాన ద్రవిడ పార్టీలు గల్లంతయ్యాయి. ద్రవిడ పార్టీలను ఇక్కడ మట్టి కరిపించిన రాధాకృష్ణన్‌కు మళ్లీ మంత్రి పదవి దక్కుతుందన్న ఆశ కమలనాథుల్లో నెలకొంది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దృష్ట్యా, రాష్ట్రంలో పార్టీ బలోపేతం వెనుక ఆయన పడ్డ శ్రమకు అధిష్టానం తప్పకుండా గుర్తింపు ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనకు పదవి దక్కుతుందన్న ఆశ లోపల ఉన్నా, బయటకు కనిపించకుండా ఢిల్లీకి ఆగమేఘాలపై రాధాకృష్ణన్ పరుగులు తీశారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, శిరసా వహిస్తానని స్పష్టం చేస్తున్న ఆయన్ను పదవి వరించడం ఖాయం.
అన్భుమణికి చాన్స్ : బీజేపీ కూటమిలోని పార్టీలన్నీ మట్టి కరిచినా, పీఎంకే మాత్రం పరువు దక్కించుకుంది. వన్నియర్ సామాజిక వర్గం ఓట్లు కలసి రావడంతో ధర్మపురిని ఆ పార్టీ చేజిక్కించుకుంది. రాజ్యసభ సీటుతో గతంలో కేంద్ర మంత్రి వర్గంలో చక్రం తిప్పిన అన్భుమణి రాందాసు తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొన్నారు. విజయం కోసం చమటోడ్చాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. వన్నియర్ కుల ఓట్లు అత్యధికంగా ఉన్న ధర్మపురిని ఎంపిక చేసుకుని పథకం ప్రకారం ముందుకు కదిలారు. ఎన్నికల ఫలితాలు ఒక్కో రౌండ్‌కు ఒక్కో రూపంలో ఉండటంతో అన్భుమణి ఆశలు తొలుత అడియాలు అయ్యాయి. అయితే, అదృష్టం కలసి వచ్చి చివరి నాలుగు రౌండ్లు ఆదుకోవడంతో గెలుపు బావుటా ఎగుర వేసిన అన్భుమణిలో కేంద్ర పదవి ఆశలు చిగురించాయి. బీజేపీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తమ నేతకు తప్పకుండా పదవి దక్కుతుందన్న ఎదురు చూపుల్లో పీఎంకే వర్గాలు ఉన్నాయి. అయితే, పీఎంకే ఆశిస్తున్నట్టుగా కేంద్రంలో కేబినెట్ హోదా పదవి మాత్రం దక్కే అవకాశాలు అరుదే.
ఇస్తే రెడీ : ఎన్డీఏ కూటమితో ఒప్పందాలు కుదుర్చుకున్న పుదుచ్చేరి ఎన్‌ఆర్ కాంగ్రెస్‌కు పీఎంకే నిర్ణయం ఇరకాటంలో పడేసింది. తమిళనాడు వరకే బీజేపీతో పొత్తు అంటూ పుదుచ్చేరిలో తమ అభ్యర్థిని పీఎంకే రంగంలోకి దించింది. అయితే, ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి హవా ముందు పీఎంకేతో పాటుగా డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్ కంగు తినాల్సి వచ్చింది. పుదుచ్చేరిలో పార్టీ ఆవిర్భావంతో సత్తా చాటిన రంగస్వామి, అదే ఊపుతో పుదుచ్చేరి ఎంపీ సీటును ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు. తమ అభ్యర్థి రాధాకృష్ణన్‌ను కేంద్రంలో మంత్రిని చేయడానికి రంగస్వామి సిద్ధం అయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతానికి తప్పని సరిగా ఓ సహాయ మంత్రి పదవి వరించడం ఖాయం కావడంతో, ఆ పదవి ఏదో తమకు ఇవ్వాలంటూ మోడీకి మొర పెట్టుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇక, ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్న ఈ మూడు పార్టీలకు కేంద్రం లో పదవులు దక్కేనా అన్నది వేచి చూడాల్సిందే.
ఆశల పల్లకిలో!
Published Sat, May 17 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM
Advertisement
Advertisement