కడప కలెక్టరేట్(వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: జాతి సంపద అయిన ఎర్రచందనం జిల్లా నుంచి అక్రమంగా తరలిపోకుండా స్మగ్లర్ల భరతం పట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశిధర్ తెలిపారు. బుధవారం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జిల్లా అటవీ రక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ నిర్మల, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట డీఎఫ్‌ఓలు నాగరాజు, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రాజు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం కలెక్టర్ సమావేశ వివరాాలను విలేకరులకు వివరించారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన దుర్ఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం పోలీసుశాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ చెప్పారన్నారు. ప్రతి డీఎఫ్‌ఓకు 1+4 ఆర్మ్‌డ్ పోలీసులను కేటాయిస్తారన్నారు. వారు చెక్‌పోస్టులు, బేస్ క్యాంపుల వద్ద విధులు నిర్వర్తిస్తారన్నారు. పోలీసు, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలని నిర్ణయించామన్నారు.
జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై నమోదైన కేసుల్లో కేవలం ఒక శాతం మాత్రమే శిక్షలు పడ్డాయని పేర్కొన్నారు. శిక్షల శాతాన్ని పెంచేందుకు అటవీశాఖ అధికారులను ఆదేశించామన్నారు. రెగ్యులర్ అటవీ చట్టాలను ప్రయోగించకుండా కేవలం పీడీ యాక్టు మాత్రమే ప్రయోగిస్తున్నారంటూ ఇటీవల సుప్రీం కోర్టు ప్రశ్నించిందని తెలిపారు. ఇకమీదట రెగ్యులర్ చట్టాలను ప్రయోగించి శిక్షల శాతాన్ని పెంచుతామన్నారు. స్మగ్లర్లకు సహకరిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొనే అటవీ అధికారులను సైతం విడువబోమని స్పష్టం చేశారు. ఎర్రచందనం చెట్లు కొట్టివేసిన ప్రాంతాల్లో తిరిగి చెట్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచుతామన్నారు. ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఎర్రచందనం తరలించే గ్రామాలపై దాడులు, చెట్లను నరికే వాళ్లను పట్టుకోవడానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అడవిలోకి వెళ్లే దారులపై దృష్టి సారిస్తామన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఫారెస్టు కన్జర్వేటర్ (ప్రొబిషనరి) కృష్ణప్రియ, సబ్ డీఎస్‌ఓలు, వెంకటేశ్, శ్రీనివాసరావు, ఫారెస్టు సెటిల్‌మెంట్ అధికారి లవన్న, ఆర్డీఓ హరిత తదితరులు పాల్గొన్నారు.
‘ఎర్ర’ దొంగల భరతం పడతాం
Published Thu, Dec 19 2013 4:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement