నివేదిక వచ్చాకే నిర్ణయం : సీఎం
మైసూరు : రాయచూరులో గురువారం టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమంలో మంత్రి తన్వీర్ సేఠ్ తన మొబైల్‌లో నీలి చిత్రాలను చూశారన్న విషయం ఇప్పటి వరకు తనకు తెలియదని, ఈ విషయంపై తాను స్వయంగా మంత్రి తన్వీర్ సేఠ్‌కు ఫోన్ చేసి వివరణ కోరినట్లు సీఎం సిద్ధు తెలిపారు. శుక్రవారం ఉదయం బెల్గాం పర్యటనకు వెళ్లడానికి ముందు మైసూరు
నగరంలోని రామకృష్ణ నగరలో ఉన్న తమ నివాసంలో ఆయన ప్రజా ఫిర్యాదుల అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మంత్రి తన్వీర్ సేఠ్ తన మొబైల్‌లో నీలి చిత్రాలు చూశారన్న విషయం తనకు తెలియదని, మీడియాలో వచ్చిన కథనాలపై తాను పూర్తి వివరణ కోరినట్లు చెప్పారు. నీలి చిత్రాలు చూసిన మాట నిజమైతే రాజీనామా తీసుకుంటారా అన్న మీడియా ప్రశ్నకు సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజా నిజాలు విచారణ చేయకుండానే రాజీమాను ఎలా తీసుకుంటారు అంటూ అయన మీడియా ప్రతినిధులపై మండిపడ్డారు. పోలీసుల వేతనాల పెంపుపై ఇప్పటికే ఆర్థిక శాఖకు వివరాలు పంపించినట్లు సీఎం ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.