పైశాచికం
నగరంలో దారుణం
చిన్నారులపై లైంగికదాడులు
పోలీసుల అదుపులో కామాంధులు
కాటేదాన్/లంగర్‌హౌస్: నగరంలో కామాంధులు రెచ్చిపోయారు. అభం శుభం తెలియని చిన్నారులపై పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. నీలి చిత్రాలు చూపిస్తూ లైంగికదాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలను ఖండించాల్సిన బడాబాబులు నిందితులకు అండగా నిలవడం శోచనీయం. బాధితులను భయపెట్టారు.సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ సంఘటనలు మైలార్‌దేవ్‌పల్లి, లంగర్‌హౌస్, ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగాయి. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టాటానగర్ ప్రాంతంలోని ప్లాస్టిక్, స్క్రాబ్ గోదాములో మహ్మద్ అన్వర్(50) మేనేజర్‌గాపనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ధరమ్‌సింగ్, చింతాబాయి దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమార్తె(11) మైలార్‌దేవ్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడోతరగతి చదువుతోంది. తల్లి చింతాబాయి ప్లాస్టిక్ గోడౌన్‌లో దినసరి కూలీగా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం ఇంటివద్ద ఒంటరిగా ఉన్న చిన్నారిపై కన్నేశాడు అన్వర్. సినిమా చూపిస్తానని మాయమాటలు చెప్పి రూమ్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ నీలిచిత్రం చూపించడమేగాక చిన్నారి పట్ల తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దీంతో చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో భయాందోళనకు గురైన అన్వర్ లైంగికదాడి విషయాన్ని ఎవరికి చెప్పరాదంటూ భయపెట్టాడు. అనంతరం ఇంటివద్దే వదిలిపెట్టాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో చిన్నారి స్నానం చేస్తుండగా రక్తస్రావం కావడం గమనించిన తల్లి ఏమి జరిగిందని నిలదీయడంతో అసలు విషయం చెప్పింది.
చిన్నారి తల్లిదండ్రులు నిందితుడిని నిలదీయడంతో వైద్యపరీక్షలు చేయిస్తానని బేరానికి దిగాడు. వైద్యపరీక్షలు చేయించేందుకు నగరంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు అన్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లాకు చెందిన జహీరా కుటుంబం లంగర్‌హౌస్ హాషంనగర్‌లో నివాసముంటోంది. ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు సంతానం. కుమార్తె(7) ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతోంది. పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న ఆజం(35) వీరి ఇంటిపక్కనే నివాసముంటూ సన్నిహితంగా మెలిగేవాడు. జహీరా దంపతులు బయటకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న జహీరా కుమారుడికి డబ్బులు ఇచ్చి చాక్లెట్లు తెచ్చుకోమని పంపాడు. చిన్నారికి ఇంటిపక్కన ఉన్న ఖాళీ స్థలానికి తీసుకువెళ్లాడు. ఫోన్‌లో నీలిచిత్రాలు చూపిస్తూ లైంగికదాడికి పాల్పడ్డాడు. మరుసటిరోజు చిన్నారి నొప్పితో ఏడుస్తుండడటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను నిలదీయగా అసలు విషయం చెప్పింది. ఆగ్రహం చెందిన వారు నిందితుడు ఆజంను నిలదీశారు. అత్యాచార ఘటన బహిర్గతం కావడంతో కొందరు బడాబాబులు రంగంలోకి దిగారు. కామాంధుడు ఆజంకు వత్తాసు పలికారు. పోలీసుల వద్దకు వెళ్లకుండా ఇచ్చిన డబ్బుతో వైద్యం చేయించుకోవాలన్నారు. విషయం బయటపెడితే ఇక్కడ ఇళ్లల్లో పనిదొరకకపోవడమే కాదు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు చేశారు. భయంతో జహీరా స్వగ్రామానికి వెళ్లిపోయారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. డీసీపీ, ఏసీపీలు లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు పరిశీలించారు. ఈ కేసులో నిందితులకు మద్దతు తెలిపిన వారిని కూడా వదలబోమని వారు తెలిపారు.