సాక్షి, ముంబై: సంపూర్ణ తెలంగాణ కోసం టీజేఏసీ హైదరాబాద్‌లో మంగళవారం చేపట్టిన దీక్షకు నగరంలోని వివిధ తెలుగు సంఘాలు మద్దతును ప్రకటించాయి. రిలయన్స్ ఎనర్జీ తెలంగాణ కార్మిక సమైక్య, ఎంటీజేఏసీ సంయుక్తంగా అంధేరీలోని అంబోలి నాకాలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఎనర్జీ కార్మిక సమైక్య అధ్యక్షుడు కె.నర్సింహగౌడ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం సూచించిన 13 అంశాలను సవరించాలని, ముంబై తెలంగాణ సంఘాలు కూడా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయన్నారు.
ఉమ్మడి రాజధాని రెండేళ్లకు కుదించాలని, ఏపీ భవన్ ఆస్తులను తెలంగాణకే ఇవ్వాలని, గవర్నర్ నుంచి శాంతి భద్రతల అధికారాలను తొలగించాలనే తదితర 13 అంశాలను కూడా సవరించాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించి వెంటనే రాష్ర్టపతికి పంపాలని, ఆతర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా కేంద్రం చూడాలని ఎంటీజేఏసీ కన్వీనర్లు దేవానంద్ నాగిల్ల, ఎస్.లక్ష్మణ్ అన్నారు. జనవరి 23లోపు ఆంధ్రప్రదేశ్ శాసన సభలో చర్చ జరిగినా, జరగకపోయినా విభజన బిల్లు కేంద్రానికి వెళ్లడం ఖాయమని ప్రధాన కార్యదర్శి బోయ శ్రీనివాస్ తెలిపారు. ఇది డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఆకాంక్ష గల పౌరులకు ఇచ్చిన ప్రత్యేక హక్కుగా అభివర్ణించారు.
ఈ ప్రదర్శనలో గందం శంకర్, పుట్టి విజయ్, పండి బాబు, అనుమల్ల యాదయ్య, గడ్డం శైవ రాములు, పలెర్ల గంగులు, పొట్ట శ్రీనివాస్, బోసి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.