వింటర్ ‘వార్’
నేటి నుంచి బెళగావిలో శీతాకాల సమావేశాలు
చెరుకు మద్దతు ధర విషయమైచట్టసభల బయట పోరు
వేలాది మంది రైతులతో సువర్ణ
విధానసౌధ ముట్టడికి బీజేపీ సిద్ధం
కళంకిత మంత్రులు, చిన్నారులపై అత్యాచారాలు... అస్త్రాలతో ఇరుకున పెట్టేలా వ్యూహం
బెంగళూరు: ఈసారి రాష్ట్ర శీతాకాల శాసనసభ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. దీంతో ప్రభుత్వం మునుపెన్నడూ లేనంతగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం నుంచి ఈనెల 20 వరకూ బెళగావిలోని సువర్ణ విధానసౌధాలో ఈ ఏడాది శీతాకాల సమవేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అటు బీజేపీతో పాటు జేడీఎస్ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయి. ముఖ్యంగా చట్టసభల్లోనే కాకుండా సమావేశాల భయట కూడా ప్రభుత్వ చర్యలను ఎండగట్టడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ విషయంలో జేడీఎస్ కంటే బీజేపీ ముందువరుసలో ఉంది. ముఖ్యంగా చెరుకు పంటకు మద్దతు ధరను ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ శాసనసభ సమావేశాల ప్రారంభం రోజునే వేలాది మంది రైతుతో సువర్ణ విధానసౌధాను ముట్టడించాలని బీజేపీ వ్యూహం తయారు చేసుకుంది. ఈ ముట్టడిలో బీజేపీ రాష్ట్రశాఖ అ ధ్యక్షుడు ప్రహ్లాద్‌జ్యోషి, మాజీ ముఖ్యమంత్రు లు యడ్యూరప్ప, శెట్టర్‌తోపాటు కేంద్రమంత్రులైన అనంతకుమార్, సదానందగౌడ, సిద్దేశ్వర్ కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. బీజేపీతో పాటు రైతు సంఘం నాయకులు కూడా ఈ ముట్టడిలో పాల్గొనననున్నారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలోని డీకే శివకుమార్, దినేష్ గుండూరావు, మహదేవప్రసాద్, ఖమరుల్ ఇస్లాం, కేజే జార్జ్ వంటి మంత్రులు అధికార దుర్వినియోగం, భూ కబ్జా తదితర వాటిని చట్టసభల్లోపల ప్రధాన అస్త్రంగా విపక్షాలు వినియోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఈ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సభల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టనున్నారు. అంతేకాకుండా అర్కావతి డీ నోటిఫికేషన్ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాత్ర కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల పాఠశాలల్లోని చిన్నారులపై హత్యాచారాలు పెరిగిపోవడం, పారిశ్రామిక ప్రగతి తిరోగమణ దిశలో ప్రయాణించడం వంటి విషయాల పై కూడా విపక్షాలు సిద్దు ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, శెట్టర్ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పలపై వివిధ కేసుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయాన్ని ప్రస్తావించి బీజేపీను అడ్డుకోవాలని ఇటు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. ఏదిఏమైనా ఈసారి శీతాకాల సమావేశాలు ఎప్పుడూ లేనంత వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. అందువల్లే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆరువేల మంది పోలీసు సిబ్బందితో గట్టి భద్రతా చర్యలు చేపట్టింది.