పర్యాటక కేంద్రంగా టౌన్‌హాల్ | town hall as tourist center | Sakshi
Sakshi News home page

పర్యాటక కేంద్రంగా టౌన్‌హాల్

Published Tue, Dec 17 2013 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

town hall as tourist center

 సాక్షి, న్యూఢిల్లీ: చాందినీ చౌక్‌లోని చారిత్రాత్మక టౌన్‌హాల్  రూపురేఖలు మారనున్నాయి. దీన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలనే ప్రాథమిక ప్రతిపాదనను ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌డీఎంసీ) సోమవారం ఆమోదించింది. టౌన్‌హాల్‌ను ఢి ల్లీ చరిత్ర, సంస్కృతిలకు అద్దంపట్టే సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా మార్చాలని ఎన్‌డీఎంసీ యోచిస్తోంది.  సకుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా టౌన్‌హాల్‌ను తీర్చిదిద్దాలని, ఆ విధంగా దీనికి వైభవాన్ని తీసుకురావాలని కసరత్తు చేస్తోంది.

మొఘల్‌కాలం నాటి  కళాకృతులు, ఆభరణాలు, దుస్తులు, ఆయుధాల ప్రదర్శనకు ఉంచేలా మ్యూజియం ఏర్పాటు, గ్రంథాలయంతో పాటు పిల్లల  కోసం రకరకాల సృజనాత్మక కార్యకలాపాలతో  కూడిన యాక్టివిటీ రూములు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆడిటోరియం, లైట్ అండ్ సౌండ్ షోలు, రెస్టారెంట్లతో టౌన్ హాల్‌ను పర్యాటక ఆకర్షక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళిక రూపొంది స్తోంది. సందర్శకులకు  మ్యూజియంలో ప్రదర్శించే దుస్తులు, ఆభరణాలు నచ్చితే  వాటి నకళ్లను తయారుచేయించుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. టౌన్‌హాల్  గ్రౌండ్ ఫ్లోర్‌లో మ్యూజియం, పిల్లల కోసం యూక్టివిటీ రూములు, బొటీక్ షాపులు మొదలైనవి ఉంటాయి. మొదటి అంతస్తులో నాలుగు రెస్టారెంట్లు ఉంటాయి. టౌన్‌హాల్ పునరాభివృద్ధికి  50 కోట్లు వ్యయమవుతుందని ఎన్‌డీఎంసీ అధికారులు అంచనా వేశారు.

 టౌన్‌హాల్ చరిత్ర
 సిపాయిల తిరుగుబాటు తర్వాత షాజహానాబాద్‌లో బ్రిటిష్‌వారు నిర్మించిన తొలి కట్టడాలలో టౌన్‌హాల్ ఒకటి. ఢిల్లీ మున్సిపల్ అధికారులు దీనిని ఏ గ్రేడ్ వారసత్వ క ట్టడాల జాబితాలో చేర్చి సంరక్షిస్తున్నారు. టౌన్‌హాల్ నిర్మాణానికి పూర్వం ఇక్కడ బేగమ్‌కీ సరాయ్, బేగమ్ కీ బాగ్ ఉండేవి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ పెద్ద కుమార్తె జహనారా బేగమ్ ఇక్కడ  ఉద్యానవనాన్ని  ఏర్పాటుచేశారు. దీనిని బేగమ్‌కీ బాగ్ 1857 తిరుగుబాటు తర్వాత  ఈ ఉద్యానవనాన్ని, సరాయ్‌ని తొలగించి  1860లో టౌన్‌హాల్‌ను నిర్మించారు. జహనారా ఏర్పాటుచేసిన ఉద్యానవనం స్థానంలో కొత్త ఉద్యానవనాన్ని రూపొందించారు. అంతకుముందు కం పెనీ బాగ్‌గా పిలిచిన ఉద్యానవనాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆజాద్ పార్క్‌గా పిలుస్తున్నారు.  ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సివిక్ సెంటర్‌కు తరలించేంత వరకు టౌన్‌హాల్ ఎమ్సీడీ  ప్రధాన కార్యాలయంగా ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement