- బీసీలుగా గుర్తించిన మహానేత వైఎస్
- రిజర్వేషన్ సౌకర్యంతో లబ్ధిపొందిన వక్కలిగలు
- స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్‌సమెంట్ వర్తింపు
- ఉద్యోగ, రాజకీయ రంగాల్లోనూ ప్రయోజనం
మడకశిర, న్యూస్‌లైన్ : ఆర్థికంగా వెనుకబడిన వక్కలిగలు దశాబ్దాలుగా ఓసీ జాబితాలో ఉండి ఎటువంటి ప్రయోజనాలకూ నోచుకోలేకపోయారు. ఆ సామాజికవర్గం పిల్లలు ఉన్నత విద్యనభ్యసించడం చాలా కష్టంగా ఉండేది. ఎంతోమంది రాజకీయ పార్టీలు, నాయకులు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి ఓటు బ్యాంకుగా వాడుకుని.. ఆ తర్వాత వారిని విస్మరించారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే బీసీల జాబితాలోకి చేరుస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వక్కలిగలను బీసీలుగా గుర్తించారు. ఫలితంగా వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఎంతోమంది రిజర్వేషన్ల ద్వారా లబ్ధిపొందారు.
రాష్ర్టంలోనే వక్కలిగ లున్న నియోజకవర్గం మడకశిర. నియోజకవర్గంలో 1,86,053 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో వక్కలిగ సామాజిక వర్గం ఓటర్లు దాదాపు 70 వేల మంది ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వీరిదే నిర్ణయాత్మకశక్తి. వీరు ఎటువైపు మొగ్గుచూపితే ఆ అభ్యర్థి విజయం సాధించినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో వక్కలిగ ఓటర్లను ఆకర్షించడానికి అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి.
బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ సామాజికవర్గం వారు తమను బీసీలుగా గుర్తించాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ అనేకసార్లు విన్నవించుకున్నారు. చంద్రబాబు మాత్రం వీరిని ఒక ఓటుబ్యాంకుగా వినియోగించుకున్నారు. అవసరం తీరాక వారి గురించి పట్టించుకోలేదు. వక్కలిగల సమస్యలను తెలుసుకునేందుకూ ప్రయత్నించలేదు.
2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పల్లెబాట-2లో భాగంగా వైఎస్ మడకశిర నియోజకవర్గంలో పర్యటించినపుడు వక్కలిగ సంఘం నాయకులు కలిసి తమను బీసీలుగా గుర్తించాలని కోరారు. ఇందుకు వైఎస్ సానుకూలంగా స్పందించి బీసీలుగా గుర్తించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బీసీ కమిషన్‌ను మడకశిర ప్రాంతానికి పంపించి వక్కలిగల స్థితిగతులపై సర్వే చేయించారు.
వక్కలిగలు చాలా వెనుకబడి ఉన్నారని బీసీ కమిషన్ సీఎం వైఎస్‌కు నివేదిక సమర్పించారు. ఆ తర్వాత వైఎస్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి వక్కలిగలను బీసీలుగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. 35 ఏళ్ల వక్కలిగల కల వైఎస్ చొరవతో సాకారమైంది. బీసీలుగా గుర్తించడంతో ఎన్నో అవకాశాలు వారి దరిచేరాయి. ఎంతోమంది సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఎంపీటీసీ. జెడ్పీటీసీలుగా ఎన్నిక కావడానికి అవకాశం ఏర్పడింది. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు లభించాయి.
ఫీజు రీయింబర్‌సమెంట్‌తో ఉన్నతవిద్యనభ్యసించడానికి మార్గం సుగమమైంది. ఎంతోమంది వక్కలిగ విద్యార్థులకు ఉద్యోగవకాశాలు లభించాయి.ఇలా నియోజకవర్గంలో వక్కలిగ సామాజిక వర్గం అభివృద్ధికి వైఎస్ చేసిన కృషి మరువలేనిది. దీంతో ఆ సామాజిక వర్గం ఓటర్లు ఈసారి వైఎస్ తనయుడి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలపరచడానికి నిర్ణయించుకున్నారు.