సాక్షి, చెన్నై(తమిళనాడు): ఆత్మహత్యకు సిద్ధపడ్డ మిత్రుడిని రక్షించి ఓ యువకుడు తన ప్రాణాల్ని వదిలాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చెన్నై శివార్లలోని పొన్నేరిలో జరిగింది. పొన్నేరికి చెందిన సెల్వకుమార్ కుమారుడు వెంకటేష్. ఇతని సెల్‌ఫోన్‌కు గురువారం అర్ధరాత్రి ఓ ఆడియో మెసేజ్ వచ్చింది. తన మిత్రుడు అరవింద్ తీవ్ర మనోవేదనతో ఆడియోను పంపించడంతో వెంకటేష్ ఆందోళనకు గురయ్యాడు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోనున్నట్లు, రైలుపట్టాలపై ఉన్నట్లుగా అరవింద్ ఇచ్చిన మెసేజ్‌తో వెంకటేష్ అప్రమత్తమయ్యాడు. అతడ్ని రక్షించేందుకు రైలుపట్టాలపై పరుగులు తీశాడు.
అక్కడి రైల్వే వంతెనపై పట్టాలపై అరవింద్ కూర్చొని ఉండడాన్ని గుర్తించాడు. పరుగున వెళ్లి అతడ్ని రక్షించే యత్నం చేశాడు. అరవింద్ వంతెన పై నుంచి కింద పడగా, వెంకటేష్ కాళ్లు ట్రాక్‌లో ఇరుక్కుపోయాయి. క్షణాల్లో అటుగా వచ్చిన ఓ రైలు వెంకటేష్‌ను ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు. వంతెనపై నుంచి కింద పడ్డ అరవింద్ కేకల్ని విన్న ఇరుగు పొరుగు వారు పరుగులు తీశారు. గాయాలతో పడి ఉన్న అరవింద్‌ను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కొరుక్కుపేట రైల్వే పోలీసులు వెంకటేష్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment