కార్మిక శాఖ కమిషనర్‌కు 108 ఉద్యోగుల సమ్మె నోటీస్
హైదరాబాద్: రాష్ట్ర 108 ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మే 5 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని తెలియజేస్తూ తెలంగాణ 108 ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసు అందించారు.
అసోసియేషన్ ప్రతినిధులు అశోక్, నాగేశ్, శంకర్‌రెడ్డి, సత్యనారాయణ, స్వామిలు మాట్లాడుతూ తెలంగాణ 108 సర్వీసులు నిర్వహిస్తున్న జీవీకే, ఈఎంఆర్‌ల సంస్థలు ఉద్యోగులపై ప్రవర్తిస్తున్న తీరును గురించి గతంలో కూడా అన్ని వైద్య ఆరోగ్య శాఖలకు, సంబంధిత మంత్రికి ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సిన పరిస్థితిని యాజమాన్యం కల్పించిందని తెలిపారు. కమిషనర్ జోక్యం చేసుకుని తొలగించిన ఉద్యోగులందరిని విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మిక కమిషనర్‌ను కోరినట్లు వివరించారు.