కమిషనరేట్ల ఏర్పాటుకు ఆమోదం
- మొత్తం 8 బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర
- జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై వాడివేడి చర్చ
- కొత్తగా నారాయణ్‌పేట్, సత్తుపల్లి, ములుగును జిల్లాలుగా చేయాలని కోరిన సభ్యులు
సాక్షి, హైదరాబాద్: అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, పలు అంశాలపై సుదీర్ఘమైన చర్చల అనంతరం బుధవారం శాసనసభ ఎనిమిది కీలకమైన బిల్లులను ఆమోదించింది. ఇందులో నాలుగు బిల్లులు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనరేట్లకు సంబంధించినవి కాగా.. మరికొన్ని పాత బిల్లులకు సవరణలను ప్రాతిపాదించింది. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, సిద్దిపేటకు నూతన పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం బిల్లుల్లో పేర్కొంది. అలాగే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న తెలంగాణ వెటర్నరీ విద్య, వైద్య సంస్థలను రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోకి తెస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ జీతాలు, పింఛన్ చెల్లింపుల చట్టంలోనూ సవరణ చేస్తూ మరో బిల్లు ప్రవేశపెట్టింది. అలాగే మున్సిపల్, పట్టణాభివృద్ధి చట్టంలో ఏకీకృత సర్వీస్ రూల్స్ నిమిత్తం మరో బిల్లు, జిల్లాల పునర్విభజన చట్టాన్ని సవరిస్తూ ఇంకో బిల్లును సభ ఆమోదించింది.
జిల్లాలపై వాడివేడిగా..
జిల్లాల పునర్విభజన, నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై అసెంబ్లీలో అధికార, విపక్షాల నడుమ వాడివేడి చర్చ జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అధికార, విపక్ష సభ్యులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నారాయణ్‌పేట్‌ను జిల్లా చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని ఆరోపిస్తూనే ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిని కొత్త జిల్లా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ములుగును కూడా గిరిజన జిల్లాగా చేయాలని కోరారు. పరకాలను భూపాలపల్లి జిల్లాలో కలిపి జిల్లా కేంద్రం చేయాలని లేదా ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గానైనా చేయాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి సూచించారు.
కొత్త కమిషనరేట్లతో మరిన్ని ఇబ్బందులు
కొత్త కమిషనరేట్ల ఏర్పాటుపై విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలకు సౌకర్యం కంటే పోలీసులకు మరిన్ని అధికారాలను ప్రభుత్వం కట్టబెడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ఉన్న కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు పెనాల్టీల నెపంతో జనాన్ని వేధించుకుతింటున్నారన్నారు. కలెక్టర్లకు ఉన్న మెజిస్ట్రీరియల్ అధికారాలను పోలీసు అధికారులకు కట్టబెడితే ప్రజలకు మరిన్ని అవస్థలు తప్పవన్నారు. కొత్త కమిషనరేట్లను ఏ ప్రాతిపదికన తీసుకువస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఇందుకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందిస్తూ.. నేరాల పరిధి ప్రాతిపదికన కమిషనరేట్లు ఏర్పాటు చేస్తున్నామని, మెరుగైన శాంతి భద్రతలే లక్ష్యమన్నారు. ఈ సమావేశాల్లోగానే ఖమ్మం పోలీస్ కమిషనరేట్ బిల్లును కూడా ప్రవేశపెడతామన్నారు.