సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ కీలక మందడుగు వేసినట్లు తెలిసింది. రెండు కార్పొరేట్ కాలేజీల కోసమే ప్రశ్నపత్రం లీకేజీ జరిగిందన్న విషయం వాసుబాబు (ఓ కాలేజీడీన్), శివనారాయణ (బ్రోకర్)ల అరెస్ట్‌తో ఇప్పటికే బయటపడగా రాగా దీనికి బలం చేకూర్చేలా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఆధారాలను సీఐడీ గుర్తించింది! ప్రముఖ కార్పొరేట్ కాలేజీకి చెందిన ఆ ఇద్దరు డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది!!
మీరు వస్తారా.. మమ్మల్నే రమ్మంటారా?
ఈ కేసులో వాసుబాబు, శివనారాయణలతో లింకున్న మరో ముగ్గురు బ్రోకర్ల పాత్ర వెలుగులోకి రావడంతో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న దశలో సీఐడీకి కీలక సమాచారం అందింది. బ్రోకర్ల కాల్ లిస్టులో ఓ కార్పొరేట్ కాలేజీకి చెందిన ఇద్దరి ఫోన్ నంబర్లు ఉండటం, ప్రశ్నపత్రం లీకేజీకి ముందు, ఆ తర్వాత కూడా వారి మధ్య సంబంధాలు కొనసాగినట్లు పక్కా ఆధారాలు లభించడంతో వారిద్దరికీ తాఖీదులు జారీ చేసి ఐదు రోజుల్లోగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయితే ఈ కేసుతో తమకేం సంబంధం లేదంటూ తొలుత ఆ ఇద్దరు డైరెక్టర్లు బుకాయించేం దుకు ప్రయత్నించారు. ‘మీరు వస్తారా.. లేక మమ్మ ల్నే రమ్మంటారా’ అని అధికారులు స్పష్టం చేయడంతో విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని వారు కోరినట్లు సీఐడీ వర్గాలు వెల్లడించాయి.
అంతా వారిద్దరి కనుసన్నల్లోనే...
ఆ కార్పొరేట్ సంస్థను ఏడేళ్ల నుంచీ ఆ ఇద్దరు డైరెక్టర్లే పర్యవేక్షిస్తున్నారు. అడ్మిషన్ల నుంచి ఫలితాల దాకా.. ఆపై సెలబ్రిటీలతో ఫొటోలకు పోజుల అపాయింట్‌మెంట్ల వరకు అన్నీ వారిద్దరి నేతృత్వంలోనే జరుగుతున్నాయి. ఆ సంస్థలో పేరుకు మరికొందరు డైరెక్టర్లు ఉన్నా పెత్తనం మాత్రం వారిద్దరిదే. వాసుబాబు, శివనారాయణలతోపాటు మరో ఇద్దరు బ్రోకర్లు... ఆ ఇద్దరి డైరెక్టర్లతో పదే పదే ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం, బేరం కుదుర్చుకున్న రెండు కాలేజీలకు చెందిన 175 మంది విద్యార్థులను క్యాంపులకు తరలించడం వంటి అంశాలపై సంప్రదింపులు జరిపినట్లు సీఐడీ గుర్తించింది. వారిని విచారిస్తే మొత్తం స్కాం దర్యాప్తు పూర్తయినట్లేనని సీఐడీ భావిస్తోంది.
2013 నుంచే బ్రోకర్లతో లింకులు!
కార్పొరేట్ కాలేజీ సంస్థకు చెందిన ఆ ఇద్దరికి, బ్రోకర్లకు మధ్య 2013 నుంచి లింకులున్నట్లు సీఐడీ గుర్తించింది. 2015లో ఎంసెట్–1, ఎంసెట్–2 ప్రశ్నపత్రం స్కాం బయటకు వచ్చినప్పటికీ అంతకుముందు ఒకే ఎంసెట్ పరీక్ష కావడంతో పేపర్ లీక్ వ్యవహారం బయటపడకపోయి ఉండొచ్చ ని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఇద్దరు డైరెక్టర్లను ప్రశ్నిస్తే అసలు కథ వెలుగులోకి వస్తుందని చెబుతున్నారు.
దర్యాప్తుకు బ్రేక్ వేయాలంటూ ఒత్తిళ్లు?
ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో ఇద్దరి పేర్లు బయటపడటంతో పవర్ సెంటర్ల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ ఇద్దరు కాలేజీ డైరెక్టర్లను విచారణకు హాజరుకావాలని ఆదేశించిన మర్నాటి నుంచి పోలీసు ఉన్నతాధికారులు, పలువురు ఐపీఎస్‌ల నుంచి దర్యాప్తు అధికారులకు ఫోన్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
గుడ్డు మీద ఈకలు ఏరడం ఆపాలంటూ ఓ ఐపీఎస్ చిందులు తొక్కినట్లు సీఐడీలో చర్చ జరుగుతోంది. దర్యాప్తు ఆపేసి చార్జిషీట్ వేసే ప్రక్రియ చూసుకోవాలని వార్నింగ్ సైతం ఇచ్చినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారిని బదిలీ చేసేందుకు కార్పొరేట్ కాలేజీల మాఫియా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలతోపాటు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు పోలీస్‌శాఖలో చర్చ జరుగతోంది.
జేఎన్‌టీయూలో పనిచేసిన అధికారిపైనా అనుమానం
జేఎన్‌టీయూలో కీలకంగా పనిచేసిన ఓ అధికారిని సైతం సీఐడీ అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే గత వారంలో రెండుసార్లు ఆయన్ను సీఐడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించింది. ప్రశ్నపత్రం రూపొందించిన వారి జాబితా, ప్రశ్నపత్రం ప్రింటింగ్‌కు ఇచ్చే సమయంలో తీసుకున్న జాగ్రత్తలు, కమిటీలో ఉన్న సభ్యులు, టెండర్ తదితర వివరాలన్నింటిపై సుదీర్ఘంగా వివరాలు సేకరించినట్లు దర్యాప్తు అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఢిల్లీ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రశ్నపత్రం ముద్రణ జరుగుతున్న విషయం ఎలా లీకైందన్న అంశంపైనే తాము దృష్టి సారించామని, అది తేలితే దర్యాప్తులో కీలక దశను చేరుకున్నట్లేనని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment