మహదేవపూర్ (మంథని): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని సీడబ్ల్యూసీ ఇంజనీర్ల బృందం గురువారం సాయంత్రం సందర్శించింది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ ‘కాళేశ్వరం మహా అద్భుతమని’కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడి పనులను చూసి నేర్చుకోవాలని ఎక్స్‌పోజర్ విజిట్ (తెలియని దానిని తెలుసుకునే సందర్శన)కు సీడబ్ల్యూసీ ఇంజనీర్ల బృందాన్ని పంపారు.
మేడిగడ్డ వద్ద గోదావరిపై నిర్మిస్తున్న బ్యారేజీ పనులను సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఎస్‌కే.రాజన్ నేతృత్వంలో 12మంది ఇంజనీర్ల బృందం పరిశీలించింది. క్షేత్రస్థాయి పరిశీలన, అధ్యయనం, కాళేశ్వరం ఇం జనీరింగ్ నుంచి కొత్త అంశాలను నేర్చుకోవడానికి వచ్చినట్లు ఇంజనీర్లు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని పేర్కొన్నారు. ఒకే రోజు 20 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగిన ప్రాజెక్టుగా రికార్డు నెలకొల్పిన ప్రాజెక్ట్ సందర్శన భవిష్యత్‌లో తమకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
దేశంలోనే తొలిసారిగా భారీ మోటార్లను ఉపయోగిస్తూ పంప్‌హౌస్‌ల నిర్మాణంలోనూ ఈ ప్రాజెక్టు రికార్డు సృష్టించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో 8 దేశాలు పాలుపంచుకుంటున్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎక్కడా లేని విధంగా 24 గంటలపాటు రాత్రింబవళ్లు పని చేస్తున్నారని, ఈ ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని అభిప్రాయపడ్డారు.
సీడబ్ల్యూసీ ఇంజనీర్ల బృందానికి డైరెక్టర్ ఎస్‌కే రాజన్ నాయకత్వం వహించగా మరో డైరెక్టర్ దేవేందర్‌రావు, ఇంజనీర్లు కృష్ణారావు, సంవృత అగర్వాల్, అశ్వీనికుమార్‌వర్మ, వైశాఖ, ధీరజ్‌కుమార్, శకిట్‌కుమార్, ఈశాన్ శ్రీవాత్సవ, చేతన, డీఎస్ ప్రసాద్, అమిత్‌కుమార్‌సుమన్ తదితరులు బ్యారేజీని సందర్శించారు. ఎల్‌అండ్‌టీ ప్రాజెక్టు మేనేజర్ రామరాజు, ప్రాజెక్టు ఈఈ రమణారెడ్డి, డీఈ సూర్యప్రకాష్ బ్యారేజీ వివరాలను వారికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment