భువనగిరి : హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి-163పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. రోడ్డు పనులు అస్తవ్యస్తంగా చేపట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా భువనగిరి ప్రాంతంలో జరుగుతున్న వరుస ప్రమాదాలు వాహనదారులను, పట్టణ ప్రజలను కలవరపెడుతున్నాయి. భువనగిరికి ముఖద్వారం లాంటి టీచర్స్‌కాలనీ ఎక్స్‌రోడ్ మృత్యువుకు చిరునామాగా మారింది. జాతీయ రహదారిపై డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడం, రోడ్డు నిర్మాణంలో పలు అవకతవకలు, సరైన సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో తరచు ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డుపై పలుచోట్ల ఏర్పాటు చేసిన చౌరస్తాలు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారాయి.
అండర్‌పాస్‌లు లేకపోవడంతో...
హైదరాబాద్-వరంగల్ రోడ్డు విస్తరణ సమయంలో ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా అధికారులకు చెవికెక్కలేదు. దీంతో రోడ్డు పక్కగా గల భువనగిరి పట్టణం, మండలాలకు వెళ్లే గ్రామాల ప్రజల భద్రతను గాలికొదిలేశారు. బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద.. భువనగిరి మండలం అనంతారం వద్ద.. భువనగిరి శివారులోని టీచర్స్ కాలనీ వద్ద.. సింగన్నగూడెం. రామకృష్ణాపురం చౌర స్తాల వద్ద బ్రిడ్జీలకు అండర్‌పాస్‌లను నిర్మించలేదు. దీంతో అక్కడ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఆయా గ్రామాల ప్రజలు జాతీయ రహదారి దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది.
ఎక్కడపడితే అక్కడ దారి మళ్లింపు..
జాతీయ రహదారిలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. వాహనాలు ఎక్కడినుంచి ఎటువైపు మళ్లించాలో తెలిపే సూచికలు కరువయ్యాయి. దీంతో వాహనదారులు ఇష్టానుసారంగా వెళ్తున్నారు. బీబీనగర్, భువనగిరి మండలం పగిడిపల్లి ఎల్లమ్మ గుడి వద్ద రెండు వైపులా వాహనాలను ఎదురెదురుగా అనుమతించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
బైపాస్ రోడ్డు ఏర్పాటుచేసిన నాటి నుంచి ప్రమాదాలు..
* 2011 నుంచి ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 30మంది వరకు మృత్యువు పాలయ్యారు.
* రాయగిరి కమాన్ వద్ద బైక్, టిప్పర్ ఢీకొని ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి.
* బీబీనగర్ సమీపంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో పద్మారెడ్డి అనే కానిస్టేబుల్ మృతిచెందారు.
* రాయగిరి కమాన్ వద్ద జరిగిన ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.
* బీబీనగర్ వద్ద డీసీఎం బోల్తా పడి ఒకరికి గాయాలు కాగా అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు.
* రాయగిరి పాఠశాల ఎదుట ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది.
* భువనగిరికి చెందిన విష్ణుచారి అనే వ్యక్తి కారులో వస్తూ బీబీనగర్ మండలం గూడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
* భువనగిరి పట్టణ శివారులో సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాబ్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతిచెంచారు. అదే ప్రదేశంలో డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు.
* రాయగిరి వద్ద బైక్‌ను టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతిచెందారు.
* బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.
* భువనగిరిలోని టీచర్స్ కాలనీ వద్ద కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఇక్కడే జరిగిన మరో ప్రమాదంలో ఒక న్యాయవాది మృత్యువు పాలయ్యారు. మరో ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
* సింగన్నగూడెంవద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. రాయగిరి రోడ్డు చివరన జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది వరకు దుర్మరణం చెందారు. గాయాలపాలైన వారు పదుల సంఖ్యలో ఉన్నారు.
* తాజాగా గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మద్యం వ్యాపారి రామ్‌గోపాల్‌రావు దుర్మరణం చెందారు.
మృత్యుమార్గం..163
Published Wed, Aug 20 2014 2:14 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement