‘డబుల్’ ఇళ్లకు వ్యాట్ మినహాయింపు
* ఇళ్ల నిర్మాణ వ్యయం తగ్గిస్తాం: సీఎం కేసీఆర్
* ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఇళ్లు కట్టిస్తాం
సాక్షి, హైదరాబాద్: సిమెంటు, స్టీలుపై వ్యాట్ మినహాయింపు, తక్కువ ధరకు ఇసుక అందివ్వడం వంటి చర్యల ద్వారా రెండు పడక గదుల ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను తగ్గించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రస్తుతం 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలుగా యూనిట్ కాస్ట్‌ను నిర్ధారించామని, వ్యాట్ మినహాయింపుతో ఈ వ్యయాన్ని తగ్గించవచ్చన్నారు.
ఆదివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో రెండు పడక గదుల ఇళ్లపై సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. కాంట్రాక్టర్లకు కూడా వ్యాట్ నుంచి ఊరటనివ్వనున్నట్టు సీఎం చెప్పారు. సిమెంటు, స్టీలు ధరలను తగ్గించే అంశంపై ఆయా కంపెనీల యాజమాన్యాలతో చర్చించనున్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించాలని నిర్ణయించామని... వరంగల్, మహబూబ్‌నగర్‌లకు ప్రత్యేకంగా హామీ ఇచ్చినందున వాటికి ఎక్కువ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు.
వ్యవసాయదారులుండే చోట వ్యక్తిగత పద్ధతిలో, వ్యవసాయేతర వ్యాపకాలుండే పట్టణ ప్రాంతాల్లో ‘జీ ప్లస్ వన్, జీ ప్లస్ టూ’ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. లేఅవుట్ చేసిన స్థలాలున్న ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే రెండు పడక గదుల ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామని.. ఒక కుటుంబానికి ఇల్లు సమకూరితే అది రెండుతరాలకు ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు.
అవగాహన కల్పించండి: వ్యవసాయ పనుల కోసం కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్లను నడపడంతో రోడ్లు పాడవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. కొత్తగా వేసిన రోడ్లు కూడా ఏడాది తిరక్కుండానే పాడవుతున్నాయని, దీనిపై రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఇక రాష్ట్రంలో పేకాట క్లబ్బులు లేకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో క్లబ్బులను నియంత్రించగానే వాటిని వేరే పట్టణాలకో, శివారు ప్రాంతాలకో, ఫామ్‌హౌస్‌లకో మార్చి కొనసాగిస్తున్నారని.. ఎక్కడా అవి కొనసాగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.