సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల విస్తృతంగా వర్షాలు కురిసినా ఈ సీజన్లో ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని 584 మండలాల్లో 181 వర్షాభావంలో చిక్కుకోగా.. వీటిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.
సంగారెడ్డి జిల్లాలో 23 మండలాలు, మెదక్ జిల్లాలో 17, సిద్దిపేట జిల్లాలో 15, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 14 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. 255 మండలాల్లో సాధారణ, 148 మండలాల్లో అధిక వర్షపాతం రికార్డయినట్లు తెలిపింది. ఖమ్మం జిల్లాలో 18 మండలాలు, ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాల్లోని 16 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
కొనసాగుతున్న అల్పపీడనం
వాయవ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చి మ బెంగాల్–ఉత్తర ఒడిషా తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో సోమ, మంగళ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment