సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు సొంత జిల్లాల్లో కొనసాగరాదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. 2018, నవంబర్ 30 నాటికి గడిచిన నాలుగేళ్ల కాలంలో ఒకే జిల్లా పరిధిలో మూడేళ్ల సర్వీ సు పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న అధికారుల బదిలీలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. బదిలీల్లో భాగంగా సొంత జిల్లాలకు ఎవరినీ పంపించరాదని పేర్కొంది. అలాగే గత అసెంబ్లీ ఎన్నికలు/ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం/జిల్లా పరిధిలో పని చేసిన జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ), రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసు ఇన్స్‌పెక్టర్లు, సబ్ ఇన్స్‌పెక్టర్లు, ఆపై హోదా కలిగిన అధికారులు మళ్లీ అదే నియోజకవర్గం/జిల్లా పరిధిలో కొనసాగరాదని సూచించింది. ఈ బదిలీల ప్రక్రియను ఈ నెల 17లోగా పూర్తి చేసి, నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఈ ఉత్తర్వుల అమలులో ఇబ్బందులుంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి మినహాయింపులు పొందవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కు సూచించింది. ఎన్నికలతో నేరుగా సంబంధం ఉన్న జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల నోడల్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లకు ఈ బదిలీ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది. అదే విధంగా ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లతో సంబంధమున్న ఐజీ, డీఐజీ, రాష్ట్ర సాయుధ బలగాల కమాండెంట్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, ఇన్స్‌పెక్టర్లు, సబ్ ఇన్స్‌పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లకు సైతం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment