సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయింపు పొందేందుకు విదేశీ ఎంబసీలు, అంతర్జాతీయ సంస్థలు రిజిస్టర్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సంబంధిత సంస్థ ప్రతినిధి డిజిటల్ సంతకంతో దరఖాస్తు చేసుకుంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్) జారీ చేస్తామని, దాని ఆధారంగా అతిథి హోదాలో జీఎస్టీ నుంచి మినహాయింపు పొంద వచ్చని పన్నుల శాఖ స్పష్టం చేసింది. ఇక ఎవరైనా డీలర్‌కు లభించే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదరు డీలర్ కట్టిన పన్ను కన్నా ఎక్కువ వస్తే ఆ మొత్తాన్ని డీలర్ ఖాతా నుంచి మినహాయించుకోవాలని పేర్కొంది.
కొనుగోలు సమయంలోనే..
విదేశీ ఎంబసీల్లో పనిచేసే విదేశీ ఉద్యోగులు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతి నిధులను మనదేశ అతిథులుగా భావించి.. వారు కొనుగోలు చేసే వస్తువులపై పన్ను మినహాయింపు ఇస్తారు. అయితే విదేశాలకు చెందిన సాధారణ పౌరులు, పర్యాటకం కోసం వచ్చేవారికి ఇది వర్తించదు. ఎంబసీలు, ఇతర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులకు మాత్రం వర్తిస్తుం ది. గతంలో వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు ఆయా సంస్థల కు చెందిన వ్యక్తులు లేదా సంస్థలు చేసే కొనుగోళ్లు, అందించే సేవలపై పన్ను విధించే వారు. తర్వాత వారు క్లెయిమ్ చేసుకుంటే.. పన్ను తిరిగి అందజేసేవారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ పన్ను మినహాయింపును కొను గోలు, సేవల సమయంలోనే ఇవ్వాలని చట్టం లో పేర్కొన్నారు. ఇందుకోసం వారు నిర్దే శిత రూపంలో దరఖాస్తులను డిజిటల్ సంతకంతో సమర్పిస్తే యూఐఎన్ జారీ చేస్తారు. ఏవైనా వస్తు, సేవలు పొందేటప్పుడు ఈ నంబర్‌ను డీలర్‌కు ఇస్తే బిల్లులోనే పన్ను మినహాయింపు వస్తుంది. ఇందుకు కేవలం డిజిటల్ సంతకం సరిపోతుందని. వారికి పాన్, ఆధార్ వంటివేవీ అవసరం లేదని పన్నుల శాఖ తెలిపింది.
ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌పై స్పష్టత
రిజిస్టర్ చేసుకున్న డీలర్లకు లభించే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) విషయంలోనూ పన్నుల శాఖ స్పష్టత ఇచ్చింది. డీలర్లకు లభించే ట్యాక్స్ క్రెడిట్ మొత్తం జీఎస్టీఆర్–3 కన్నా జీఎస్టీఆర్–3 బీలో ఎక్కువ వస్తే ఆ మొత్తాన్ని డీలర్ ఖాతాకు జమచేయాలని.. తక్కువ వస్తే ఆ డీలర్ ఖాతా నుంచి మినహాయించుకోవాలంది.