సాక్షి, సిటీబ్యూరో : కరోనా పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ రోజుకో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నది. తాజాగా శనివారం రికార్డు స్థాయిలో 179 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 11న అత్యధికంగా 175 కేసులు నమోదు కాగా.. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4737 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటి వరకు 182 మంది మృతి చెందారు. 2352 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం 2203 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 80 శాతం మంది గ్రేటర్‌వాసులే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా వైరస్ బారిన పడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. కరోనా విస్తరణ నగరంలో కొనసాగుతోంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారి విస్తరిస్తున్న తీరుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
(స్వచ్ఛందంగా లాక్‌డౌన్)
ఎల్‌బీనగర్ : ఎల్‌బీనగర్ సర్కిళ్ల పరిధిలో శనివారం 4 కరోపా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మన్సూరాబాద్ డివిజన్ లెక్చరర్స్ కాలనీలోని ఎస్‌వీ హోమ్స్ అపార్టుమెంట్‌లో ఉండే ఓ వ్యక్తి(37)కి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. మన్సూరాబాద్‌లోని శ్లోకా స్కూల్ సమీపంలో నివాసముండే ఓ వ్యక్తి(32)కి, ఇదే డివిజన్‌కు చెందిన చంద్రపురికాలనీలోని రోడ్ నంబర్–5లో నివాసముండే మరో వ్యక్తి(38)కి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. సర్కిల్–5లో అష్టలక్ష్మీ టెంపుల్ సమీపంలోని వాసవీకాలనీలోని ఓవ్యక్తి కరోనా బారిన పడ్డారు. ఇతను నగరంలో ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్ పనిచేస్తున్నారు. వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ప్రగతి నగర్‌లో...
నిజాంపేట్ : ప్రగతి నగర్‌లో సాయి భవాని టిఫిన్ సెంటర్ యజమానికి కరోనా ఫాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పరిసర ప్రాంతాల ప్రజలతోపాటు, కార్పొరేషన్ సిబ్బంది కూడా ఇక్కడి నుంచి టిఫిన్స్ తీసుకెళ్లడంతో ఆందోళన అధికం అవుతోంది.
రాంగోపాల్‌పేట్ డివిజన్‌లో...
రాంగోపాల్‌పేట్: రాంగోపాల్‌పేట్ డివిజన్‌లో ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంగళరావునగర్‌కు చెందిన ఓ మహిళ(58) జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. బేగంపేట బ్రాహ్మణవాడిలో విధులు నిర్వహిస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. పంజగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఈఎస్‌ఐలో ఉచిత వైద్యం అందుబాటులో ఉండగా అక్కడికి తరలించారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో సిటీ స్కాన్ కోసం సచివాలయ ప్రాంతంలోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాస్మండిలో మరో వృద్ధురాలి(62)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె దీర్ధకాలిక రోగాలతో నిమ్స్‌లో చికిత్స పొందుతుంది. వైద్యులు ఆమెకు కరోనా టెస్టు చేయగా పాజిటివ్‌గా తేలింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో...
వెంగళరావునగర్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని జీహెచ్‌ఎంసీ సర్కిల్–19 ఉప కమిషనర్ ఎ.రమేష్ తెలిపారు. యూసుఫ్‌గూడ డివిజన్ హైలాంకాలనీలోని బాలుడు(15), అదే ప్రాంతానికి చెందిన యువకుడు(28), శ్రీకృష్ణానగర్‌లోని మహిళ(33)కు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. అలాగే రహమత్‌నగర్ డివిజన్‌లోని శ్రీరామ్‌నగర్‌కు చెందని ఓ యువకుడు(29), బాబా సైలానీనగర్‌లోని ఓ వ్యక్తి(58), ఓంనగర్‌కు చెందిన మహిళ(52) మహమ్మారి బారిన పడ్డారన్నారు. బోరబండ డివిజన్ ఎస్‌ఆర్‌టీనగర్‌లోని మహిళ(51) కు కరోనా వచ్చినట్టు డీఎంసీ పేర్కొన్నారు.
శేరిలింగంపల్లిలో...
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన టైర్ పంక్ఛర్ చేసే వ్యక్తి(47)కి పాజిటివ్‌గా రావడంతో చెస్ట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. చందానగర్ రాజేందర్‌రెడ్డి కాలనీకి చెందిన 57 ఏళ్ల వ్యక్తికి రావడంతో ప్రైవేటు హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. గచ్చిబౌలికి చెందిన 52 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిజివ్ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నాడు.
ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో...
అమీర్‌పేట: ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే ఇద్దరు పోలీసులకు పాజిటివ్ ఇచ్చింది. జనరల్ డ్యూటీలో పనిచేసే కానిస్టేబుల్‌తోపాటు హోంగార్డుకు కరోనా నిర్ధారణ అయింది. చికిత్స నిమిత్తం వారిని ఎర్రగడ్డ ఛాతీ వైద్య ఆస్పత్రికి తరలించారు.
బోడుప్పల్‌లో...
బోడుప్పల్: బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ రాగా ఓ మహిళ మృతిచెందింది. భాగ్యనగర్ కాలనీలోని స్నేహ నివాస్‌లో ఉండే ఓ మహిళ (53) కరోనాతో ఆస్పత్రి చికిత్స పొందుతూ మృతిచెందింది. బోడుప్పల్ లెక్చరర్స్ కాలనీలో ఓ టీవీ రిపోర్టర్(42)కు కరోనా సోకింది. వారి కుటుంబంలో భార్య, ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment