నివాళులు అర్పిస్తున్న సీఆర్‌పీఎఫ్ అధికారులు, స్థానికులు... ఇంద్రకుమార్ (ఫైల్)
తాండూర్(బెల్లంపల్లి) : ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. జీవితాంతం చెదిరిపోని జ్ఞాపకంగా మిగిలిపోయే ఘనమైన ఘట్టమది. అలాంటి క్షణాల కోసం యువతీ యువకుల ఎదురుచూపుల గురించి చెప్పనక్కర్లేదు. సరిగ్గా అలాంటి సందర్భంలోనే జరగరానిది ఘటన జరిగితే.. ఎంత విషాదం..!
ఇంద్రకుమార్... సీఆర్‌పీఎఫ్ జవాన్. వయస్సు 29 ఏళ్లు. తాండూర్ మండలం కిష్టంపేట గ్రామం. తండ్రి లింగాల బానయ్య చనిపోయాడు. తల్లి మల్లమ్మ, ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. అక్కాచెళ్లెళ్లకు పెళ్లి కాగా.. తల్లి, తమ్ముడికి ఇతడే ఆధారం.
ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరగాలని పెద్దలు అంటారు కదా! ఇంద్రకుమార్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉండటంతో ఇంట్లోవాళ్లు పెళ్లి సంబం దాలు చూశారు. ఈనెల 25న నిశ్చితార్థం ఖరారు చేసి సమాచారం అందించారు.
2014లో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఇంద్రకుమార్ రాయ్‌ఘడ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. తన నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు ఈనెల 19న సెలవుపై ఇంటికి వచ్చేందుకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఘోరం జరిగిపోయింది.
ఇంద్రకుమార్ రైలులో వస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు వద్ద రైలునుంచి జారిపడ్డాడు. తీవ్ర గాయాలైన అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయాడు. కుటుంబసభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.
సీఆర్‌ఎఫ్ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని శుక్రవారం కిష్టంపేటకు తీసుకొచ్చారు.
వరంగల్ రేంజ్ సీఆర్‌పీఎఫ్ కమాండర్ రమేష్ కబాడియా, ఎస్సైలు సిగ్గు కుమార్, అర్జున్‌రెడ్డి, 58 బెటాలియన్ జవాన్లు, తాండూర్ తహసీల్దార్ రామచంద్రయ్య, తాండూర్ ఎస్సై రవి.. ఇంద్రకుమార్ భౌతికకాయంపై జాతీయ జెండాను కప్పి నివాళులర్పించారు. అనంతరం సీఆర్‌పీఎఫ్ జవానులు గాలిలోకి కాల్పులు జరిపి సైనిక వందనం సమర్పించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ తరపున మృతుడి తల్లి మల్లమ్మకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎక్స్‌గ్రేషియా, మృతుడి తల్లికి పెన్షన్‌ను త్వరగా వచ్చేలా చూస్తానని సీఆర్‌పీఎఫ్ కమాండర్ రమేష్ కబాడియా హామీ ఇచ్చారు.