పెట్టుబడులకు ఆస్ట్రేలియా సుముఖత
* మంత్రి జూపల్లిని కలసిన ఆస్ట్రేలియా బృందం
* ప్రభుత్వ విధానాలను వివరించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్ : పారిశ్రామికీకరణ దిశలో వేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఉన్నాయని ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ పార్లమెంటరీ కార్యదర్శి, ఎంపీ హాన్ స్టీవెన్ సియోబో గురువారం సచివాలయంలో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యారు.
గనులు, వ్యవసాయం, నీటి యాజమాన్యం తదితర రంగాల్లో ప్రావీణ్యం కలిగిన ఆస్ట్రేలియాకు తెలంగాణలో ఆయా రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని సియోబో అభిప్రాయం వ్యక్తం చేశారు. సూక్ష్మ సేద్యం, మౌలిక సౌకర్యాలు, విద్య, రోడ్డు భద్రత తదితర అంశాల్లో తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకు అవకాశం ఉందన్నారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి వివరించారు. భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ పాట్రిక్ సక్లింగ్, దక్షిణ భారత కాన్సుల్ జనరల్ సీన్ కెల్లీతో పాటు వాణిజ్య బృందం సభ్యులు మంత్రి జూపల్లిని కలిసిన వారిలో ఉన్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, కమిషనర్ మణికారాజ్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
హాంకాంగ్‌కు చెందిన మెజ్జో హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ జాన్ ఎడ్మండ్‌సన్ నేతృత్వంలోని ఈశాన్య ఆసియా పెట్టుబడిదారుల బృందం మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయింది. తైవాన్, జపాన్, హాంకాంగ్, చైనా దేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఈ బృందంలో ఉన్నారు. సెల్‌ఫోన్ విడిభాగాలు, ఆటోమోటివ్ పార్టులు, గృహ, మౌలిక సౌకర్యాలకు సంబంధించిన యూనిట్లు రాష్ట్రంలో నెలకొల్పేందుకు ఈ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది.
భౌగోళికంగా హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేకతలను వివరించడంతో పాటు, ఎగుమతులు, రవాణాకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. డ్రైపోర్టులు, విద్యుత్, మౌలిక సదుపాయాలు తదితర రంగాల అభివృద్ధికి సహకారం అందిస్తామని ఈశాన్య ఆసియా బృందం సభ్యులు హామీ ఇచ్చారు. రూ.1,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన సమగ్ర ప్రణాళికతో త్వరలో వస్తామని ప్రకటించారు.