ఆత్మగౌరవంతోపాటు ఆర్థికాభివృద్ధి.. | Minister KTR Speech At Gouda Community Meet In Hyderabad | Sakshi
Sakshi News home page

ఆత్మగౌరవంతోపాటు ఆర్థికాభివృద్ధి..

Published Sun, Jan 5 2020 2:58 AM | Last Updated on Sun, Jan 5 2020 2:58 AM

Minister KTR Speech At Gouda Community Meet In Hyderabad - Sakshi

శనివారం నగరంలో జరిగిన గౌడ సంఘం ఆత్మీయ సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో స్వామి గౌడ్, బూర నర్సయ్య గౌడ్, శ్రీనివాస్‌ గౌడ్, గంగాధర్‌ గౌడ్‌ తదితరులు 

లక్డీకాపూల్‌: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న కృషి పొరుగు రాష్ట్రాలకు సైతం స్ఫూర్తిదాయకంగా ఉందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ సంపదను పెంచి పేదలకు పంచడమే లక్ష్యంగా బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు. నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో శనివారం సాయంత్రం తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు గౌడ్‌ ఈ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లా డుతూ.. కులవృత్తితో జీవనం సాగించే వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు, ఆర్థిక పురోభివృద్ధికి కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ సమర్థవంతమైన నాయకత్వం, కార్యదక్షత, పటిష్టమైన శాంతిభద్రతలను అమలు చేయడం వల్లనే తెలంగాణ పురోగమిస్తుందన్నారు. కేసీఆర్‌ కార్యదక్షతను ఏపీ సీఎం వై.ఎస్‌ జగన్‌ అసెంబ్లీలో మెచ్చుకుని అభినందించిన విషయాన్ని ప్రస్తావించారు. గీత కార్మికులకు 200 ఉన్న íపింఛన్‌ను 2000కు పెంచినట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను పెంచినట్లు చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వం సర్వాయి పాపన్న అస్తిత్వాన్ని కాపాడుతుందన్నారు. కులవృత్తులను ప్రోత్సహించే లక్ష్యంతోనే నీరా పాలసీని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన నీరాను రుచి చూశారు. తాను నీరా సేవించడం తొలిసారి అని, ఇప్పట్నుంచే దానికి అభిమానిని అయ్యానని కేటీఆర్‌ చెప్పారు. నీరాకు అంతర్జాతీయంగా ప్రాచు ర్యం కల్పిస్తామన్నారు. కల్లుగీత కార్మికులకు త్వరలో లూనాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే బడ్జెట్లోనే దీన్ని ప్రతిపాదిస్తామన్నారు. గౌడ్‌ల కోసం ప్రత్యేక ఆర్థిక సంస్థ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.  

నీరా గౌడ జాతికి అంకితం 
రాష్ట్ర ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ..   నీరాను గౌడ జాతికే ఇవ్వాలని జీవో తేవడంలో కేటీఆర్‌ ఎంతో కృషి చేశారన్నారు. దేవతల కాలంలోనూ సురాపానాన్ని అమృతం అనే వారని, వైద్యులు లేని రోజుల్లో కల్లు, నీరా తాగితే 15 జబ్బుల దాకా తగ్గేవని చెప్పారు. గీత కార్మికులు వందల ఏళ్ల నుంచి చనిపోతున్నా అదే వృత్తి చేస్తున్నారని చెప్పారు. గత పాలకులు కుట్రతో కల్లును విషపూరితమైనది చిత్రీకరించారన్నారు. వ్యాపార లాభాపేక్షతో గౌడేతరులు కల్తీ చేయడం వల్లే కల్లు పట్ల అపోహలు నెలకొన్నాయన్నారు. కల్లు వృత్తి అని చెప్పుకునేందుకు సిగ్గు పడిన తీరు నుంచి ఇప్పుడు తమది నీరా వృత్తి అని గౌరవంగా చెప్పుకునేలా సీఎం కేసీఆర్‌ చేశారన్నారు. వృత్తిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిన వారికి తగిన బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. గౌడల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 3.70 కోట్ల చెట్లను నాటించామన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌..గీతకార్మికులకు సంబంధించి పలు విన్నపాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నీరా ప్రాజెక్ట్‌ తేవడం పట్ల కేటీఆర్‌కు రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్‌ రాజేశం గౌడ్, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేంద్ర గౌడ్, గంగాధర్‌ గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, వివేకానంద గౌడ్, జగదీశ్‌ గౌడ్‌  పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement