టవర్‌సర్కిల్ : విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారి కరీంనగర్ జిల్లా పర్యటనకు మంగళవారం వస్తున్నారు. టీడీపీ అధినేతగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పర్యకొనసాగనుంది. చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రం సమీపంలోని తిమ్మాపూర్‌కు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు.
అక్కడినుంచే ఆయనకు స్వాగతం పలికేందుకు నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని అంబేద్కర్‌స్టేడియంలో జరిగే సభాస్థలికి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటారు. వ తొలుత ప్రతినిధుల సభ, అనంతరం నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అర్థరాత్రి దాటే వరకు జరగనుండడంతో రాత్రి బస ఇక్కడే చేయనున్నారు. బుధవారం ఉదయం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.
భారీగా స్వాగత ఏర్పాట్లు..
చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు తెలుగుతమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నగరాన్ని ఫ్లెక్సీలు, పసుపు జెండాలతో నింపేశారు. తిమ్మాపూర్ నుంచి ర్యాలీగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం చేరుకుంటారు. మార్గమధ్యం లో ఎన్టీఆర్, ఫూలే, గాంధీ విగ్రహానికి, తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
నియోజకవర్గాల వారీగా సమీక్ష..
చంద్రబాబు తొలుత పార్టీ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలు, భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసేందుకు నియోజకవర్గాల వారీగా సమీక్షించనున్నారు. గతంలో పార్టీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో పాగావేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల దశ, దిశలను నిర్దేశిస్తారు. ఓ వైపు సభ సక్సెస్ కోసం తెలుగు తమ్ముళ్లు విశ్వప్రయత్నాలు చేస్తుంటే, మరో వైపు చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ ప్రకటించింది. చంద్రబాబుకు పోటీగా అదే రోజు కరీంనగర్‌లోనే నిరసన సభ నిర్వహిస్తామని తెలిపింది. ఆ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా వర్గీకరణపై చంద్రబాబు వైఖరి తేల్చాలంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలకు సిద్దమవుతున్నారు. దీంతో బాబు పర్యటనకు బారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
హెలిప్యాడ్ స్థలంలో మార్పులు
తిమ్మాపూర్ : చంద్రబాబు రాక సందర్భంగా రామకృష్ణకాలనీలో హెలిప్యాడ్ స్థలాన్ని మూడురోజుల క్రితం టీడీపీ నాయకులు పరిశీలించి ఖరారు చేశారు. ఇంజినీరింగ్ అధికారులు పనులు చేపట్టారు. అయితే ఆ స్థలాన్ని సోమవారం టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, దేవినేని ఉప, పెద్దిరెడ్డి, విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, నరేందర్‌రెడ్డి, నర్సింగరావు పరిశీలించారు. అక్కడకు జిల్లా ఎస్పీ శివకుమార్, ఏఎస్సీ జనార్దన్‌రెడ్డి, ఓఎస్డీ సుబ్బారాయుడుతోపాటు పోలీసు అధికారులు చేరుకున్నారు.
స్థలంలో మట్టి అధికంగా ఉన్నందున హెలికాప్టర్ దిగే సమయంలో ఇబ్బంది ఏర్పడుతుందని దయాకర్‌రావు చెప్పడంతో వేరే స్థలాన్ని పరిశీలించారు. అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు టీడీపీ నేతలు సూచించి వెళ్లిపోయారు. ఒక రోజు ముందు సోమవారం సాయంత్రం హెలిప్యాడ్ స్థలాన్ని మార్చడంతో అటు పోలీసు, ఇటు ఇంజినీరింగ్ అధికారులు ఆందోళనకు గురయ్యారు.
కరీంనగర్ కలెక్టరేట్ హెలిప్యాడ్ స్థలం బాగుంటుందని అధికారులు చెప్పినా టీడీపీ నాయకులు ఆ మాట వినకుండా రామకృష్ణకాలనీ వద్దనే హెలిప్యాడ్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపారు. ఇదిలా ఉంటే చంద్రబాబు రాక సందర్భంగా కాన్వాయ్ ట్రయల్ రన్‌ని సోమవారం పోలీసులు నిర్వహించారు. రామకృష్ణకాలనీ హెలిప్యాడ్ వద్ద పోలీసు అధికారులు, బలగాలు మోహరించాయి. రాజీవ్ రహదారి పొడవునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రహస్య చర్చ...
టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, జిల్లా ఎస్పీ శివకుమార్ హెలిప్యాడ్ స్థలం వద్ద ప్రత్యేకంగా మాట్లాడారు. చంద్రబాబు పర్యటనలో ఆటంకాలపై చర్చించినట్లు తెలిసింది. ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన తెలుపుతామని చెప్పడంతో ఆ పరిస్థితిపై వారిద్దరు మాట్లాడినట్లు సమాచారం. వర్గీకరణపై చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎర్రబెల్లి అన్నట్లు సమాచారం.
నేడు జిల్లాకు చంద్రబాబు రాక
Published Tue, Mar 3 2015 3:52 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement