* రెండో విడత నిధుల విడుదలపై అయోమయం
* బోగస్ రైతులు, బినామీలు ఉన్నారంటూ మళ్లీ తనిఖీలు
* వినియోగపత్రాలు ఇవ్వాలంటూ బ్యాంకులకు సర్కారు ఆదేశం
* ఆ వివరాలు ఇస్తేనే ‘రెండో విడత’ నిధులిస్తామని స్పష్టీకరణ
* బ్యాంకుల నిర్లక్ష్యం.. ఇప్పటికి అందజేసింది 46 శాతమే
* ప్రభుత్వం ‘మాఫీ’కి నిధులివ్వకపోతే రైతులకు రుణాలు కష్టమే!
* వారంలో ప్రారంభం కానున్న ఖరీఫ్.. ఆందోళనలో రైతన్న
* ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతన్నకు మళ్లీ కష్టకాలం వచ్చింది. వారం పదిరోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలుకానున్నా.. బ్యాంకుల నుంచి రుణాలు అందే అవకాశం కనిపించడం లేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితీ తప్పేటట్లు లేదు. ఇప్పటికీ రెండో విడత రుణమాఫీపై సర్కారు ప్రకటన చేయకపోవడం, మొదటి విడత రుణమాఫీ వినియోగ పత్రాలు (యూసీలు) ఇస్తేనే రెండో విడత మాఫీ ప్రకటిస్తామనడం, మళ్లీ కొత్తగా తనిఖీలంటూ మెలికపెట్టడం వంటివాటితో ‘రుణమాఫీ’పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు బ్యాంకులు కూడా ప్రభుత్వానికి యూసీలను అందజేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. దీంతో రైతులు ఆందోళనలో కూరుకుపోతున్నారు.
అంతటా నిర్లక్ష్యం..
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు మాఫీ ప్రకటించింది. ఈలెక్కన మొత్తంగా 35.82 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. మొదటి విడతగా గత ఏడాది రూ.4,230 కోట్లను జిల్లాల్లోని బ్యాంకులకు విడుదల చేసింది. అందులో బ్యాంకులు ఇప్పటివరకు రూ.4,086.22 కోట్లను రైతుల ఖాతాలో మాఫీ చేశాయి. మిగతా రూ.143 కోట్లను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించాయి. చాలా చోట్ల రైతులకు రుణ హామీ పత్రాలను కూడా అందజేశాయి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రుణమాఫీకి కొర్రీలు పెడుతోంది.
మొదటి విడతగా విడుదల చేసిన నిధులకు సంబంధించి.. వినియోగపత్రాలు (యూసీలు) ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. యూసీలు ఇస్తేనే రెండో విడత రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అయితే పూర్తి వివరాలు అందుబాటులో ఉండి కూడా బ్యాంకులు యూసీలు అందజేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. జిల్లాల్లో ఇప్పటివరకు 104 నోడల్ బ్యాంకులు (46 శాతం) మాత్రమే యూసీలు అందజేశాయి. ఇంకా 138 నోడల్ బ్యాంకులు (54 శాతం) ఇవ్వలేదు. వెంటనే ఇవ్వాల్సిందిగా సర్కారు పదేపదే కోరినా స్పందించకపోవడం గమనార్హం. అసలు రెండో విడత రుణమాఫీ నిధులు అందకుంటే.. రైతులకు కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకాడుతాయి. ఇది రైతులకు శాపంగా మారనుంది.
మళ్లీ తనిఖీల మెలిక
రుణమాఫీ అంశంలో సర్కారు కొత్త మెలికలు పెడుతోంది. అనేకచోట్ల బోగస్ రైతులు, బినామీలు మొదటి విడత రుణమాఫీ సొమ్ము పొందారంటూ మళ్లీ తనిఖీలు మొదలుపెట్టింది. అలాంటివారిని గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ప్రతీ జిల్లాలో 10 గ్రామాల చొప్పున ర్యాండమ్‌గా తీసుకుని పరిశీలించాలని.. సోమవారం నాటికి నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో ప్రస్తుతం జిల్లాల్లో అధికారులు ఈ పనిలోనే నిమగ్నమయ్యారు. అయితే అనేక సార్లు తనిఖీలు చేసి, ఎమ్మార్వో ధ్రువీకరణ ఇచ్చాకే సంబంధిత రైతులకు రుణమాఫీని వర్తింపచేశారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ తనిఖీలు చేపట్టడంలో మతలబేమిటో అంతుపట్టడం లేదని వ్యవసాయశాఖ అధికారులే పేర్కొంటున్నారు. వినియోగపత్రాలు, తనిఖీల పేరుతో రెండో విడత రుణమాఫీని వీలైనంత ఆలస్యం చేయాలనేది సర్కారు వ్యూహంగా కనిపిస్తోందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చే అవకాశముంది.
బ్యాంకుల్లో రుణమాఫీ, వినియోగపత్రాల వివరాలు
జిల్లా రుణమాఫీ బ్యాంకుల వినియోగపత్రాలు
(రూ.కోట్లలో) సంఖ్య ఇచ్చిన బ్యాంకులు
ఆదిలాబాద్ 366.17 28 0
కరీంనగర్ 415.69 25 11
ఖమ్మం 426.85 31 25
మహబూబ్‌నగర్ 681.46 35 3
మెదక్ 488.39 28 4
నల్లగొండ 588.25 27 20
నిజామాబాద్ 400.45 24 16
రంగారెడ్డి 251.72 28 27
వరంగల్ 467.24 29 11
మొత్తం 4,086.22 255 117
‘రుణమాఫీ’కి కొత్త మెలికలు
Published Sun, May 31 2015 4:21 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM
Advertisement
Advertisement