సాక్షి, జగిత్యాల : ఒకప్పుడు సైకిల్ అంటే సామాజిక హోదా, సైకిల్ ఉంటే సమాజంలో గౌరవం ఉండేది. ఏదైనా పని ఉందంటే చాలు సైకిల్ వేసుకుని రివ్వున వెళ్లి పని ముగించుకుని వచ్చేవారు. పాఠశాల, కాలేజీ, ఆఫీస్, వ్యవసాయం, వ్యాపారం ఏ పనికి వెళ్లాలన్నా సైకిల్‌పైనే ఆధారపడేవారు. సైకిల్ నిర్వహణకు పెద్దగా ఖర్చు కూడా ఉండేది కాదు. అంతెందుకు పెళ్లి కుదిరిందంటే పెళ్లి కూతురు తల్లిదండ్రులు వరుడికి వరకట్నం కింద సైకిల్, గడియారం పెట్టడం ఆనవాయితీగా ఉండేది.
సైకిళ్లు అద్దెకిచ్చేందుకు వాడవాడలా సైకిల్ టాక్సీలు ఉండేవి. ఉదయం 8 గంటలు కాకముందే సైకిల్ టాక్సీని కొత్తపెల్లి కూతురులా ముస్తాబు చేసి అందులోని సైకిళ్లను శుభ్రంగా తుడిచి వరుసలో అమర్చి అద్దెకిచ్చేందుకు సిద్ధంగా ఉంచేవారు. ఒక ఊరు నుంచి మరో ఊరికి గాని పట్టణానికి బస్సుల్లో వెళ్లేవారు తమ స్థానిక అవసరాల కోసం సైకిల్ టాక్సీల్లో సైకిళ్లను అద్దెకు తీసుకుని తమ అవసరాల మేరకు వినియోగించుకుని తిరిగి ఇచ్చేటప్పుడు అద్దె చెల్లించేవారు.
ఈ అద్దె గంటలు, రోజులు, నెలల లెక్కన ఉండేది. సొంత సైకిళ్లు లేనివారు సైకిల్ నేర్చుకునేందుకు అద్దె సైకిళ్లు కిరాయికి తీసుకునేవారు. ఒకప్పుడు సైకిల్ నడపడం రాదంటే నామోషీగా భావించేవారు. రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను ప్రజలకు వివరించేందుకు, నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా సైకిల్ యాత్రలు నిర్వహించేవారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సైకిల్, మోటార్ సైకిళ్ల స్పీడుకు కనుమరుగవుతోంది.
ప్రస్తుతం మోటార్‌సైకిల్లే కిరాయికి లభిస్తుండటంతో పెద్ద సైకిళ్లు అద్దెకిచ్చే టాక్సీలు మూతపడ్డాయి. దీంతో సైకిల్ టాక్సీలు నిర్వహించేవారు ప్రస్తుతం ఫ్యాన్సీ సైకిళ్లు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఏదిఏమైనా మనిషితో మమేకమై వారితో విడదీయరాని బంధాన్ని కలిగిన సైకిల్ ప్రస్తుతం ఓ గతించిన జ్ఞాపకంగా మిగిలిందని అంటున్నారు సైకిల్ ప్రియులు.
ఆదరణ కరువైంది..
గత 30 ఏళ్లుగా సైకిల్ టాక్సీ నడుపుతూ జీవనం సాగించాం. ప్రస్తుతం మోటార్ సైకిళ్ల వాడకం పెరగడంతో పెద్ద సైకిళ్లకు ఆదరణ కరువై వాటిని ఎవరూ వాడకపోవడంతో సైకిల్ టాక్సీ ఎత్తేసి ఫ్యాన్సీ సైకిళ్ల విడిభాగాలు అమ్ముతున్న. రిపేరు చేస్తూ ఎలాగోలా సర్దుకుంటున్నాం.
– కరుణాకర్, సైకిల్ టాక్సీ నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment