సాక్షి, హైదరాబాద్: విందు భోజనమంటే లొట్టులేసుకుంటూ వెళ్లే జనం.. ఇప్పుడు ఆ పేరు చెబితేనే జంకుతున్నారు. వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభ కార్యాలకు ఆహ్వానం అందిందంటే చాలు దాన్ని తప్పించుకునే సాకులు వెతుకుతున్నారు. సామూహిక భోజనాలు చేయాల్సి రావడం, అపరిశుభ్ర వాతావరణం, వందల్లో బంధువులు, స్నేహితుల్ని పలుకరించాల్సి రావడంతో శుభకార్యాలకు వెళ్లకపోవడమే మంచిదనే భావనకు వస్తున్నారు. రోజురోజుకు విస్తృతమవుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో శుభకార్యాలకు హాజరవుతున్న వారి సంఖ్య హైదరాబాద్ సహా ముఖ్య పట్టణాల్లో 65 నుంచి 70 శాతం వరకు తగ్గిపోయింది.
బతికుంటే బలుసాకు తింటాం..
రాష్ట్రంలో ప్రస్తుతం శుభకార్యాలకు మంచిరోజులు నడుస్తుండటంతో వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు పెరిగాయి. గడిచిన మూడు నెలలుగా లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ శుభకార్యాలను ప్రస్తుతం చేసేందుకు జనం ఇష్టపడుతున్నారు. దీంతో ఈ కార్యక్రమాలకు అందుతున్న ఆహా్వనాల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే గతంలో హైదరాబాద్ సహా ముఖ్య నగరాలు, పట్టణాల్లో నిర్వహించే శుభకార్యాలకు వేలల్లో జనం హజరయ్యే వారు. ప్రస్తుతం ఈ నగరాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు వందల్లో కూడా హాజరు కావడం లేదు. మరీ ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి కార్యక్రమాలకు వస్తున్న అతిథుల సంఖ్య వంద కూడా దాటడం లేదు. నగరంలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఫంక్షన్ హాళ్లు అందుబాటులో లేక ఫాంహౌస్‌లు, స్థానిక ప్రాంగణాలు, గుళ్లలోనే వివాహాలు జరిపిస్తున్నారు. దీంతో సామాజిక దూరమనేది కష్టంగా మారింది.
ఈ నేపథ్యంలో ఈ కార్యాలకు బంధువులు, స్నేహితుల రాక 70 శాతం తగ్గింది. అదీగాక ఇటీవల నగరంలో చోటుచేసుకున్న కొన్ని కరోనా కేసులు రిసెప్షన్, పుట్టినరోజు వేడుకలకు హాజరైనందు వల్లే పెరిగిన ఉదంతాలతో మరింత అప్రమత్తమయ్యారు. ఇక శుభకార్యాలకు హాజరైన వారు సైతం అక్కడి విందును ఆరగించేందుకు నిరాసక్తత కనబరుస్తున్నారు. ‘సామాజిక దూరం’అనేది ఇప్పుడు ప్రపంచ నినాదం కావడంతో ఒకేచోట కలసి భోజనం చేసేందుకు జనం జంకుతున్నారు. ‘వంద నుంచి ఐదు వందల మంది వ్యక్తులతో కలసి విందు ప్రాంగణంలో భోజనం చేయాలంటే ఇప్పుడు అతిథులు రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఏమాత్రం అపరిశుభత్రతతో కూడిన ప్రాంగణమున్నా, ఒకరు తిన్న ప్లేట్లనే మళ్లీ శుభ్రంచేసి తీసుకొచి్చనా జనాలు భోజనం చేసేందుకు జంకుతున్నారు. బతికుంటే బలుసాకు తింటామంటూ విందు భోజనం చేయకుండానే జారుకోవడం మేం గమనించాం’అని కూకట్‌పల్లికి చెందిన క్యాటరింగ్ ఏజెన్సీకి చెందిన వ్యాపారి ఒకరు పేర్కొన్నారు. ఇక రెస్టారెంట్లలోనూ గతంలో స్నేహితుల బృందాలు, సహోద్యోగుల బృందాలు జరుపుకునే చిన్నచిన్న విందు భోజనాలు ఇప్పట్లో కనిపించడం కష్టమేనని బంజారాహిల్స్‌కు చెందిన ఓ ప్రముఖ రెస్టారెంట్ యజమాని వాపోయారు.
ఆహార వృథా తగ్గింది
గతేడాది కేంద్ర ఆహార శాఖ నిర్వహించిన సర్వేల్లో దేశంలో ఏటా శుభకార్యాలపై చేస్తున్న ఖర్చు రూ.1.10 లక్షల కోట్లుందని, ఇందులో రూ.40 వేల కోట్లకు పైగా ఆహార వంటకాలపై వెచి్చస్తున్నారని తెలిపింది. ఇందులో 15–20% అంటే సుమారు రూ.10 వేల కోట్ల ఆహార వృథా ఉంటోందని తేల్చి చెప్పింది. హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ వృథా రూ. వెయ్యి కోట్లుంటుందని గుర్తించింది. కరోనా వైరస్ నేపథ్యంలో వేలల్లో వచ్చే చోట వందల్లో.. వందల్లో వచ్చే చోట పదుల సంఖ్యలోనే అతిథులు హాజరవుతుండటం, దానికి తగ్గట్లుగానే ఆహార వంటలను పరిమితం చేయడంతో ఆహార వృథా గణనీయంగా తగ్గుతోంది. ఇక బఫే విధానంలో భోజనం చేసేందుకు చాలామంది సంశయిస్తుండటంతో చాలా శుభకార్యాల్లో కూర్చుని దూరదూరంగా తినేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
దీంతో కుటుంబ సభ్యులే నేరుగా కూర్చున్నవారి వద్దకే వెళ్లి వడ్డించేలా ఏర్పాట్లు చేయడంతో∙ఆహార వృథా తగ్గుతోంది. ఆతిథ్యరంగ సంస్థలు, క్యాటరింగ్ వారు వడ్డించే సమయాల్లో సాధారణంగా ఆహార వృథా 15 నుంచి 25 శాతం ఉంటుండగా, ఇప్పుడు ఆ అవసరాలు తగ్గడంతో వృథా తగ్గింది. ‘లాక్‌డౌన్‌కు ముందు విందు భోజనాల్లో 15–20 రకాల వంటకాలు ఉండేవి. ఇప్పుడు నాలుగైదు రకాలు మించొద్దని చెబుతున్నారు. గతంలో విందు భోజనాలపై రూ.లక్ష వరకు ఖర్చు చేసేవారు ఇప్పుడు రూ.25 వేలు కూడా ఖర్చు చేయడం లేదు. వంటకాలు ఎప్పుడైతే తగ్గుతాయో వృథా కూడా తగ్గుతుంది’అని ఓ క్యాటరింగ్ వ్యాపారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment