ధర్నా చేస్తున్న మురళి భార్య, కార్పొరేటర్ సరిత
సాక్షి, హన్మకొండ చౌరస్తా : అధికార పార్టీకి చెందిన దివంగత కార్పొరేటర్ అనిశెట్టి మురళీ హత్యకు గురై ఏడాదైన సందర్భంగా హతుడి ప్రత్యర్థి మిత్రులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకోడాన్ని పోలీసుల్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నెల 13న హత్య కేసు ప్రధాన నిందితుడి ఇంట్లో జరిగి నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా మీడియా, పత్రికల్లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే.
దీంతో పోలీసులు వీడియో ఆధారంగా బాబురావు, రాజేశ్, రాకేష్, ధర్మ, సంజీవ్, బొమ్మతి విప్లవ్‌కుమార్, ఫయాజ్, అకాశ్, శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు. ఈ తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది.
డెత్‌డే సంబురాలు నిర్వహించడం వెనుక ఎవరి హస్తం ఉంది.. అందులో పాల్గొంది తొమ్మి ది మందేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం బుధవారం వారిని అరెస్టు చూపెట్టనున్నట్లు సమాచారం.
మురళీ భార్య, కార్పొరేటర్ సరిత ధర్నా
కార్పొరేటర్‌గా కొనసాగుతున్న అనిశెట్టి మురళీ హత్య జరిగిన రోజున, ప్రత్యర్థుల మిత్రులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకోవడంపై మురళీ భార్య, 44వ డివిజన్ కార్పొరేటర్ సరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ ప్రజలు, బంధువులతో కలిసి డివిజన్‌లోని కేయూ బైపాస్ రోడ్డు లోగల హనుమాన్ జంక్షన్‌లో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార పార్టీలో కొనసాగుతున్న తన భర్త హత్యకు గురైతే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు.
రాజకీయ కుట్రలతోనే తన భర్తను హత్య చేయించారని ధ్వజమెత్తారు. తన భర్త హత్యకు గురై ఏడాది గడుస్తున్నా నిందితులకు శిక్ష పడకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగిన సమయంలో ఆరుగురు ఉంటే అందులో ఏ ఒక్కరిని సాక్షులుగా చేర్చకపోవడంపై అనుమానాలున్నాయని అన్నారు.
ఆరుగురి సభ్యుల్లో ఒకరిద్దరి సహకారంతోనే తన భర్త హత్య జరిగిందన్నారు. పది రోజుల్లో మంత్రి కేటీఆర్ డివిజన్‌కు వచ్చి నిందితులకు శిక్ష పడేలా చూస్తానని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే డివిజన్ ప్రజలతో కలిసి తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment