ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలు? | prc for telangana employees from april | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలు?

Published Fri, Jan 2 2015 2:00 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

prc for telangana employees from april

* ఈ ఆర్థిక సంవత్సరంలో కష్టమంటున్న ఆర్థికశాఖ వర్గాలు
* ఈ నెల మూడో వారంలో ఫిట్‌మెంట్ ప్రకటించనున్న కేసీఆర్
* ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భృతి ఇస్తున్న టీ సర్కారు
* ఫిట్‌మెంట్ 42 శాతం ఇస్తే.. అదనపు భారం రూ. 3,000 కోట్లు
* ఏటా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపులకే రూ. 23 వేల కోట్లు!
* ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే పడే భారం మరో నాలుగైదు వేల కోట్లు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ వచ్చే ఏప్రిల్ నుంచి అమలుకానున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొత్త వేతన సవరణ ఫిట్‌మెంట్ ఎంతన్నది ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ నెల మూడోవారంలోనే ప్రకటించనున్నారు. కానీ నగదు రూపంలో అమలు మాత్రం ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పీఆర్సీ భారం పడితే ఇబ్బంది ఎదురవుతుందన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పదో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తన నివేదికను గత మే నెలలో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలోనే గవర్నర్ నరసింహన్‌కు సమర్పించిన సంగతి తెలిసిందే. జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో... ఆ నివేదికను ఇరు రాష్ట్రాలకు గవర్నర్ అప్పగించారు. పీఆర్సీ చైర్మన్ పి.కె. అగర్వాల్ ఆ నివేదికలో ఫిట్‌మెంట్‌ను 29 శాతంగా సిఫారసు చేశారు. అయితే పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి ముందే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన 27 శాతం మధ్యంతర భృతిని... దాదాపు ఏడాది కాలంగా ఉద్యోగులకు ఇస్తూ వస్తున్నారు. తాజాగా పీఆర్సీని అమలు చేయాలంటూ ఉద్యోగుల డిమాండ్ నేపథ్యంలో... దీనిపై త్వరగా ఒక నిర్ణయానికి రావాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది.

ఈ మేరకు గత నెల 30న తెలంగాణ ఉద్యోగ సంఘాల డైరీల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్... పీఆర్సీపై జనవరి మూడోవారంలో ప్రకటన చేస్తామని వెల్లడించారు. దీంతో ఉద్యోగ సంఘాలు జనవరి నుంచే వేతన సవరణ అమలు అవుతుందని భావిస్తున్నాయి. కానీ ఆర్థిక శాఖ అధికారులు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించిన మేరకు లేదన్న కారణంతో... పీఆర్సీ అమలును ఏప్రిల్‌కు వాయిదా వేయించాలని యోచిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చిల్లో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్కసారిగా నిధులు విడుదల చేయాల్సి వస్తుందని.. ఆ సమయంలోనే పీఆర్సీ అమలు చేయాలంటే కష్టమనే అభిప్రాయంతో వారు ఉన్నారు.

మరోవైపు... ఉద్యోగ సంఘాలు 69 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇచ్చే 27 శాతం మధ్యంతర భృతి పోగా ఒక్కో శాతం ఫిట్‌మెంట్‌కు ఖజానాపై ఏడాదికి రూ. 200 కోట్ల భారం పడుతుందని ఓ అధికారి వివరించారు. ఆ లెక్కన ఫిట్‌మెంట్ 42 శాతంగా ప్రకటిస్తే ఏటా మూడు వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఈ లెక్కన ఏటా ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించే మొత్తం రూ. 21 వేల కోట్ల నుంచి రూ. 22 వేల కోట్ల మేరకు చేరుకుంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఫిట్‌మెంట్‌ను ఎంత నిర్ణయిస్తారన్నదానిపై భారం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఖాళీగా ఉన్న లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తే... ఆ ఉద్యోగులకు చెల్లించడానికి ఏటా మరో నాలుగైదు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement