వ్యవసాయమంటే ప్రాణం  | Sakshi Interview With TRS MLA Anjaiah Yadav | Sakshi
Sakshi News home page

వ్యవసాయమంటే ప్రాణం 

Published Sun, Jul 14 2019 12:50 PM | Last Updated on Sun, Jul 14 2019 12:51 PM

Sakshi Interview With TRS MLA Anjaiah Yadav

ట్రాక్టర్‌ నడుపుతున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌

‘నాటకం ఉందంటే చాలు మిత్రులతో కలిసి సైకిల్‌ మీద సవారీ చేస్తూ ఎంత దూరమైనా వెళ్లి చూసేవాళ్లం. పౌరాణిక సినిమాలంటే ప్రాణం.. పద్యాలు భలే ఇష్టం.. రంగ స్థల కళాకారుడిగా బహుమతులు అందుకున్న క్షణాలు మరిచిపోలేనివి. ఎనిమిదో తరగతిలోనే నాగలి పట్టా.. వ్యవసాయం అంటే ప్రాణం.. రాజకీయాల ద్వారా ప్రజల్లో ఉండటం నా అదృష్టం’ అని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. పర్సనల్‌ టైమ్‌లో భాగంగా తన జ్ఞాపకాలు, అభిరుచులను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాట్లాలోనే.. 

సాక్షి, షాద్‌నగర్‌ టౌన్‌: నేను వ్యవసాయ కుటుంబంలో జన్మించా. భార్య, ఇద్దరు పిల్లలు.. పెద్ద కుమారుడు ఎల్గనమోని రవీందర్‌ యాదవ్‌ ప్రస్తుతం కేశంపేట ఎంపీపీగా ఉన్నారు. రెండో కుమారుడు మురళీకృష్ణ యాదవ్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో పని చేస్తున్నారు. నేను ఎక్కువగా రాజకీయాలకే పరిమితం కుటుంబ సరదాలు తక్కువే. ఐదో తరగతి వరకు మా స్వగ్రామమైన ఎక్లాస్‌ఖాన్‌పేటలో చదివా. కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హైస్కూల్‌ చదువు కొనసాగింది. 1967– 68 సంవత్సరంలో షాద్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎస్‌సీ పూర్తి చేశా. హైదరాబాద్‌ కోఠి వివేకానంద కళాశాలలో పీయూసీ చదివా. పత్తర్‌ఘాట్‌లోని ఎంబీ సైన్స్‌ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశా.  

మాల్‌ పటేల్‌గా పని చేశా.. 
రెవెన్యూశాఖలో ఆనాటి మాల్‌ పటేల్‌ అంటే ఇప్పటి వీఆర్‌ఓగా, పట్వారీగా, పోలీస్‌ పటేల్‌గా పనిచేశా. ఆ కాలంలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. నాదగ్గరికి పని కోసం వచ్చే రైతులకు, ప్రజలకు బస్సుచార్జీలు నేనే ఇచ్చేవాడిని. వారికి ఏ కార్యాలయంలో పని ఉన్నా నా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకెళ్లి పని చేసిపెట్టేవాణ్నిను. పేదవాళ్ల కోసం నా జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పేదలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఎంతో కృషి చేశా. 

సేవ చేయాలనే సంకల్పంతోనే... 
కుటుంబ బాధ్యతల కోసం ఉద్యోగినయ్యా. నా సంతోషం కోసం కళాకారుడినయ్యా. నాకిష్టమైన పాత్ర రాజకీయ నాయకుడే.. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే అవకాశం ఇక్కడే దొరుకుతుంది. రెవెన్యూ శాఖలో మంచి ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం చిన్నతనం నుంచే ఉంది. రాజకీయాల్లోకి వస్తేనే అది సాధ్యమని నమ్మిన వ్యక్తిని. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కాల్పుల్లో విద్యార్థులు చనిపోయారు. ఇది నన్ను ఎంతో బాధించింది. కేసీఆర్‌ చేపట్టిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నన్ను రాజకీయాల వైపు నడిపించింది. అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా.  

వ్యవసాయం అంటే ఇష్టం.. 
నాకు వ్యవసాయ అంటే చాలా ఇష్టం. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నాగలి పట్టా. చిన్నపిల్ల వాడిని నాగలి కొట్టొద్దని చెప్పారు. అయినా నేను నాగలి కొట్టడం నేర్చుకున్నా. నాపని తనం చూసి పొలంలో సాళ్లు కొట్టాలన్నా, సాగు పనులు చేయాలంటే ముందు వరుసలో నా నాగలే ఉండాలని అందరూ పట్టుబట్టేవారు. వ్యవసాయం నాకు వ్యసనంగా మారడంతో పొలానికి వెళ్లి  పనుల్లో లీనమై పోయేవాన్ని.   

మామిడికాయ కారం.. నెయ్యి భలే ఇష్టం 
 నాకు చిన్నప్పటి నుంచి మామిడికాయ కారం, నెయ్యి అంటే భలే ఇష్టం. ఆ రెండు ఉంటే చాలా కడుపునిండా భోజనం చేస్తా. మాంసాహారం తినడం జీవహింస అని భావించి.. శాకాహారిగా మారా. నాటకం, పద్యాలు నాకు ప్రాణం. కళాకారుడిగా మారి రామాయణ, మహాభారతం నాటకాల్లో ప్రదర్శించా. అభిమన్యుడు, ఉత్తర కుమారుడు, అర్జునుడు, మార్కాండేయుడి వంటి పాత్రలు వేసి బహుమతులు కూడా అందుకున్నా. శ్రీరాముడు నాకు ఆదర్శం.   

సరదాలు.. సంతోషాలు 
పౌరాణిక సినిమాలు ఎంతో ఇష్టంగా చూసే వాడిని. ఇప్పటీకీ టీవీల్లో అలాంటి సినిమాలు వస్తే చూస్తాను. ఇప్పటి సినిమాల మీద నాకు అంతగా ఆసక్తి లేదు. మిత్రులతో కలిసి కబడ్డీ బాగా ఆడేవాళ్లం. ఇప్పటికీ చిన్ననాటి స్నేహితులను కలుస్తుంటా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement