పుస్తకాలు, యూనిఫామ్స్‌ తమ వద్దే | Schools Starts From Tomorrow | Sakshi
Sakshi News home page

అమ్మో జూన్‌ 12

Published Tue, Jun 11 2019 10:37 AM | Last Updated on Tue, Jun 11 2019 10:37 AM

Schools Starts From Tomorrow - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జూన్‌ వచ్చిందంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుడుతోంది. వేసవి సెలవుల్లో పిల్లలతో గడిపిన ఆనందం క్షణాల్లో ఆవిరవుతోంది. ఏటా భారీగా పెరుగుతున్న ఫీజులతో పేద, మధ్య తరగతి వర్గం చితికిపోతోంది. ట్యూషన్‌ ఫీజుల పేరుతో ఇప్పటికే భారీగా వసూలు చేస్తున్న ప్రైవేట్‌ యాజమాన్యాలు... పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్, స్టేషనరీ సైతం తమ వద్దే కొనాలని కొత్తగా నిబంధనలు పెడుతుండడం, వాటి ధరలు బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే రెట్టింపు ఉండడంతో తల్లిదండ్రులకు పిల్లల చదువు భారమవుతోంది. విద్యార్థులకు మంగళవారంతో వేసవి సెలవులు ముగుస్తాయి. జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తమ విద్యార్థులను బడికి పంపే ఏర్పాట్లలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. పుస్తకాలు, డ్రెస్సులు, షూస్‌ కొనుగోళ్లపై దృష్టిసారించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులు ఎక్కువగా ఉండడం, ఫీజు మొత్తం ప్రారంభంలోనే చెల్లించాల్సి వస్తుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితే ఇలా ఉంటే.. అతి తక్కువ వేతనాలతో కాలం వెల్లదీస్తున్న సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, చిరుద్యోగుల పరిస్థితి మరింత దయానీయంగా మారింది. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున 60,000 నుంచి 80,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక ఇద్దరు/ముగ్గురు పిల్లలున్న తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఒక్కసారిగా ఖర్చులన్నీ మీద పడడంతో సగటు మధ్య తరగతి కుటుంబం ఆర్థికంగా చితికిపోతోంది. 

నిబంధనలకు నీళ్లు..   
1994 జీఓ నంబర్‌ 1 ప్రకారం పాఠశాలలు 5శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి. వసూలు చేసిన ఫీజుల్లోంచి 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి. ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రయోజనాలకు 15 శాతం, పాఠశాల నిర్వహణకు, అభివృద్థికి 15 శాతం చొప్పున ఖర్చు చేయాలి. కేవలం 5 శాతం మాత్రమే యాజమాన్యం లాభంగా ఆశించాలి. కానీ 80 శాతం ఆదాయాన్ని లాభంగా తీసుకుంటూ, కేవలం 20 శాతం మాత్రమే ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం వెచ్చిస్తున్నారు. అంతేకాదు పాఠశాల ఆదాయ, వ్యయాలపై ప్రతి ఏటా వార్షిక నివేదికలు, ఆడిట్‌ రిపోర్ట్‌లను ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ ఏ ఒక్క స్కూలు కూడా సమర్పించడం లేదు. ఒకవేళ ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ అనుమతి తీసుకోవాలి. పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్‌లను స్కూల్‌ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న కచ్చితమైన నిబంధనలు పెట్టరాదు. వీటి అమ్మకాలకు పాఠశాలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చిన షాపులో కొనుగోలు చేయొచ్చు. పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈ–టెక్నో తదితర పేర్లు ఉండకూడదు. కేవలం పాఠశాల పేరు మాత్రమే పేర్కొనాలి. కానీ నగరంలో చాలా పాఠశాలలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించేందుకు టెక్నో, ఐఐటీ, ఒలింపియాడ్, కాన్సెప్ట్, ఈ–టెక్నోతో ప్రచారం చేసుకుంటున్నాయి.  

అజమాయిషీ కరువు...
గ్రేటర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న పలు కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యాసంస్థలపై ప్రభుత్వ అధికారుల అజమాయిషీ కొరవడుతోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. విద్యాసంస్థ ఏర్పాటు నుంచి నిర్వహణ వరకు చాలా అంశాల్లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను చాలా విద్యాసంస్థలు పట్టించుకోకపోవడం గమనార్హం. వీటిపై కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో మిగతా విద్యాసంస్థలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వివరిస్తున్నారు. క్రీడా ప్రాంగణం, విశాలమైన తరగతులు, విద్యార్హతలున్న ఉపాధ్యాయుల భర్తీ, విద్యార్థుల సంఖ్యకు తగినట్లు మరుగుదొడ్లు, మూత్రశాలల ఏర్పాటు చేయాలనే నిబంధనను చాలా విద్యాసంస్థలు అమలు చేయట్లేదనే ఆరోపణలున్నాయి. డిజిటల్‌ తరగతి గదులు, ఏసీ ప్రాంగణాల పేరుతో ఫీజులు భారీ స్థాయిలో వసూలు చేయడంపై కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా నిర్ణయించిన ఫీజులను సకాలంలో చెల్లించకపోతే అపరాధ రుసుం కలిపి వసూలు చేస్తున్నాయని పేర్కొంటున్నారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో అడ్డూఅదుపు లేకుండా వసూళ్లు చేస్తున్న ఫీజులపైనా విద్యాశాఖ నియంత్రణ ఉండాలని కోరుతున్నారు. ఇంత ఫీజులు వసూళ్లు చేస్తున్న చాలా విద్యాసంస్థల్లోనూ కనీస వసతులు, క్రీడా మైదానాలు ఉండట్లేదని వివరిస్తున్నారు.  

 ఖర్చులు ఇలా... (సుమారు) 
స్కూల్‌ ఫీజు                     రూ.40,000–60,000
పుస్తకాలకు                     రూ.4,500–6,500
ట్రాన్స్‌ఫోర్ట్‌ ఫీజు                 రూ.6,000–8,000
రెండు జతలయూనిఫామ్‌    రూ.3,500–4,000
రెండు జతల షూలు           రూ.800–1200
టై, బెల్ట్స్‌                         రూ.150–500
బ్యాగులు                        రూ.500–1500
ఇంటి అద్దె                       రూ.6,000–12,000
కిరాణ సామాను               రూ.4,000–6,000
పాలు, కూరగాయాలు,ఇతర ఖర్చులు    రూ.5,000

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement