నిరసనల సెగ | SEGA protests | Sakshi
Sakshi News home page

నిరసనల సెగ

Published Wed, Mar 4 2015 2:45 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

SEGA protests

కరీంనగర్ : టీడీపీ అధినేత చంద్రబాబు సభకు ఎమ్మార్పీఎస్ నిరసనల సెగ తగిలింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, కరీంనగర్‌లో సభను అడ్డుకుని తీరతామని చెప్పిన ఎమ్మార్పీఎస్ నాయకత్వం సభలో, బయట నిరసన తెలిపి పంతం నెగ్గించుకుంది. చంద్రబాబు సభకు పోటీగా నిర్వహిద్దామనుకున్న ఎమ్మార్పీఎస్ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబు సభలో నిలదీస్తామని మంద కృష్ణ 24 గంటల ముందే హెచ్చరించి, ఒకరోజు ముందే కరీంనగర్ చేరుకున్నారు. ఆయన బస చేసిన శ్రీనివాస హోటల్‌ను పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు రామకృష్ణాపూర్ కాలనీకి వచ్చారనే విషయం తెలవగానే మంద కృష్ణ తన అనుచరులతో హోటల్ నుంచి సభ ప్రాంగణానికి బయలుదేరడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ప్రతిఘటించడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.
 
 ఈ క్రమంలో హోటల్ అద్దాలు ధ్వంసమై పలువురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, మీడియూ ప్రతినిధులు గాయపడ్డారు. చివరకు కృష్ణను, అనుచరులను అరెస్టు చేసి పీటీసీకి అక్కడినుంచి రామడుగు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు అల్గునూరు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు పైకి వెళ్తున్న సమయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. టీడీపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు.
 
 ప్రతినిధుల సభలో...
 బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా వేదిక ముందు భాగాన కూర్చున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నల్లజెండాలు, ఎమ్మార్పీఎస్ జెండాలు పైకేత్తి నిరసన తెలపడంతో గందరగోళం నెలకొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదా లు చేయడంతో వారిపై ఒక్కసారిగా పసుపుదండు కార్యకర్తలతోపాటు టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించారు.
 
  సభ నుంచి ఈడ్చుకెళ్తున్న సమయంలోనే మహిళా కార్యకర్తలు వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేయడంతో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో చంద్రబాబు జోక్యం చేసుకుని వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని, అనవసరపు ఆందోళనకు దిగడం సరికాదని అన్నారు. అటు పోలీసులు, ఇటు టీడీపీ కార్యకర్తలు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను సభ నుంచి బయటివరకు కుర్చీలతో కొట్టుకుంటూ పిడిగుద్దులు కురిపిస్తూ తీసుకెళ్లడంతో సభలో ఏం జరుగుతుందోనని కాసేపు సస్పెన్స్ కొనసాగింది.
 
 బాబును నీడలా వెంటాడతాం- మంద కృష్ణ
 వర్గీకరణ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న చంద్రబాబును నీడలా వెంటాడతామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. శాంతి యుత నిరసన తెలుపుతుంటే అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. చంద్రబాబు ఎక్కడ సభ పెట్టినా అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసినవారిలో మంద కృష్ణతోపాటు మామిడిపెల్లి బాపయ్య, మార్వాడి సుదర్శన్, సతీశ్ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement