నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్ వే (ఇన్‌సెట్‌లో) స్పిల్‌వేపై ఏర్పడిన పగుళ్లు
రెండు తెలుగు రాష్ట్రాల వరప్రదాయినీ.. లక్షలాది ఎకరాలకు సాగునీరు... కోట్లమంది దాహార్తిని తీరుస్తున్న ఆధునిక దేవాలయం.. ఇదీ నాగర్జునసాగర్ ప్రాజెక్టు ఘనకీర్తి. ఇంతటి చరిత్ర కలిగిన ప్రాజెక్టులో ముఖ్యమైన స్పిల్ వే మరమ్మతు పనులు ప్రశ్నార్థకంగా మారాయి. ఆరేళ్లుగా అధికారులు అంచనాలు రూపొం దించడం.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం పరిపాటిగా మారిందనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. భారీగా వరదలు వస్తే పెను ఉపద్రవమే సంభవించే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నాయి.
నాగార్జునసాగర్ :సాగర్ జలాశయంలో 546 అడుగులకు నీరు తగ్గినప్పుడే స్పిల్‌వే మరమ్మతులు చేసేందుకు వీలవుతుంది. నాలుగేళ్లుగా ఈ పనులు చేసేందుకు జలాశయంలో నీరు తక్కువగా ఉండి వెసులుబాటు ఉంది. అయినా సాగునీటి పారుదలశాఖ అధికారులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అంచనాలు తయారుచేసి పంపాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే టెండర్లు పిలుస్తామన్నట్లు అధికారులున్నారు. మూడేళ్ల క్రితమే స్పిల్‌వే దెబ్బతిన్న ప్రాంతాలను ఇంజినీర్లు రెడ్‌మార్కు వేసి గుర్తించారు.
మళ్లీ అదే విధంగా చేస్తేనే..
అయితే అధికారులు మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట మినహాయిస్తే స్పిల్‌వే ఇంతవరకు దెబ్బతిన లేదు. తిరిగి గుంతలు పడినచోట ఆవిధంగా మరమ్మతులు చేస్తేనే ప్రాజెక్టుకు భద్రత చేకూరుతుందనేది నిపుణుల అభిప్రాయం. లేకుంటే డ్యాం రేడియల్ క్రస్ట్‌గేట్లపైనుంచి నీరు కిందికి దుముకుతున్న సమయంలో అది స్పిల్‌వేమీదుగా తీవ్రమైన ఒత్తిడితో జారుతుంది. మాములుగా సిమెంట్ కాంక్రీట్ చేస్తే నీటి ఒత్తిడికి వెంటనే పెచ్చులు లేసి నీటిలోనే కలిసికొట్టుక పోయే అవకాశాలుంటాయని అనుభవజ్ఞులైన ఇంజనీర్లు పేర్కొంటున్నారు.
వరదలు వస్తే..
నాగర్జునసాగర్ నిర్మాణం చేపట్టి 63 ఏళ్లు అవుతోంది. ఆనాటి కట్టడాన్ని డిస్ట్రర్బ్ చేయకుండా మరమ్మతులు చేయాలి. ఆ కట్టడాలను ఏ మాత్రం కదల్చడానికి వీలులేదు. స్పిల్‌వేకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోతే గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున వరదలు వస్తే ప్రాజెక్టుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఉన్న ప్రాజెక్టులను మరింతకాలం మన్నికగా ఉండేలా మరమ్మతులు చేయడంకూడా అభివృద్ధిలో భాగమేనన్నది పాలకులు గుర్తించాల్సి ఉందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. సరైన సమయంలో మరమ్మతులు చేయకపోతే ఉపద్రవాలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
దెబ్బతిన్న చోటే మరమ్మతులు చేయాలని..
ప్రాజెక్టు నిర్వహణకు కేటాయించే నిధులతోనే ఇంజినీర్లే ఆ పనులు చేయాలనే ఆలోచనకు వచ్చి చాలారోజుల వరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేదు. మూడేళ్లుగా డ్యాం నిర్వహణకు నామ మాత్రపు నిధులనే కేటాయించడం జరుగుతోంది. ఆపనులు మాత్రం రూ.కోట్లలో చేయాల్సి రావడంతో ఇక స్థానికంగా పనులు చేయలేమని అధికారులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. దీంతో ఏటా అంచనాలు తయారుచేసిన పైలును ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పెద్ద ఎత్తున వరదలు పోటెత్తిన సమయంలో స్పిల్‌వే దెబ్బతిన్నప్పుడు రెయిన్‌ఫోర్సుడ్ కాంక్రీట్‌ను భూంపంప్ సహకారంతో ఆయా రంధ్రాల్లోకి పంపారు. జాతీయనిర్మాణ(ఎన్‌ఏసీ)సంస్థ సూచించిన కాంక్రీట్‌మిక్స్‌డ్ డిజైన్ ప్రకారం ఎం60 గ్రేడు సిలికాప్యూమ్, స్టీల్‌వైర్‌ఫైబర్‌ను చేర్చారు. ఒక క్యూబిక్ మీటరు పరిధిలో ఉన్న గుంతలను పూడ్చడానికి స్టీల్‌వైర్‌ఫైబర్‌ను 40కిలోల చొప్పున వాడారు.
Comments
Please login to add a commentAdd a comment