కొరియా కబడ్డీ కోచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి | Srinivasreddy is a Kabaddi Korea coach | Sakshi
Sakshi News home page

కొరియా కబడ్డీ కోచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి

Published Tue, Jun 10 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

కొరియా కబడ్డీ కోచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి

కొరియా కబడ్డీ కోచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి

మెదక్ జిల్లా ఉత్తర్‌పల్లి గ్రామానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. అతని ప్రతిభను గుర్తించిన కొరియా తమ దేశ జాతీయ కబడ్డీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాలని కోరుతూ ఆహ్వా నం పంపింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెల్లవారుజామున కొరియా వెళ్లనున్నారు. శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం ఆంధ్రాబ్యాంకు కబడ్డీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఓ కబడ్డీ క్రీడాకారుడు విదేశీ జట్టు కోచ్‌గా ఎంపిక కావటం ఇదే ప్రథమం.

ఏషియన్ గేమ్స్ టార్గెట్‌గా

2014 ఏషియన్ గేమ్స్‌కు కొరియా ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఇన్‌షాన్‌సిటీలో జరగనున్న ఈ క్రీడల్లో సత్తా చాటేందుకు కొరియా ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే కబడ్డీలో సైతం తప్పకుండా మెడల్స్ కొట్టేయాలని భావిస్తున్న కొరియా తమ దేశ జట్టుకు కోచ్‌గా ఓ భారతీయున్ని నియమించాలని భావిస్తోంది. అందులో భాగంగానే కొరియా కబడ్డీ అసోసియేషన్ గత నెలలో ఇండియాలోని కబడ్డీ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇండియా కబడ్డీ ఫెడరేషన్ తరఫున పలువురు సీనియర్ క్రీడాకారులు దరఖాస్తులు పంపగా, మెదక్ జిల్లా ఉత్తర్‌పల్లి గ్రామానికి చెందిన ఎల్.శ్రీనివాస్‌రెడ్డి కొరియా కబడ్డీ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. దీంతో ఆ దేశ ప్రాదేశిక క్రీడా సంస్థ, కొరియన్ కబడ్డీ అసోసియేషన్ సంయుక్తంగా శ్రీనివాస్‌రెడ్డికి కోచ్ నియామకం ఉత్తర్వులు, వీసా మంజూరు చేశాయి. ఆరుమాసాల పాటు కొరియా కబడ్డీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్న శ్రీనివాసరెడ్డి, ఆ దేశ రాజధాని బుసాన్‌లో బస చేయనున్నారు.

అంచలంచెలుగా అంతర్జాతీయస్థాయికి

మెదక్ జిల్లా ఉత్తర్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి అంచలంచెలుగా అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారునిగా ఎదిగారు. శ్రీనివాస్‌రెడ్డి  1995 నుంచి 1997 వరకు ఉస్మానియా యూనివర్సిటీ తర ఫున వివిధ టోర్నమెంట్‌లలో ఆడారు. ఆ తర్వాత హైదరాబాద్ జట్టు నుంచి జాతీయ క్రీడల్లో పాల్గొన్నారు. 2003లో ఆఫ్రో ఏషియన్‌గేమ్స్‌లో పాల్గొన్నారు. అదే సంవత్సరం మలేషియాలో నిర్వహించిన ఏషియన్‌గేమ్స్‌లో ఇండియా టీం తరఫున ఆడారు. 2005లో ఇరాన్‌లో నిర్వహించిన ఏషియన్‌గేమ్స్‌లోనూ ఉత్తమ ప్రతిభను కనబరచి బంగారు పతకం సాధించారు. 2009లో చైనాలో నిర్వహించిన ఏషియన్‌గేమ్స్‌లో భారత జట్టు తర ఫున ఆడారు. 2006 నుంచి శ్రీనివాస్‌రెడ్డి ఆంధ్రాబ్యాంకు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

విదేశీ జట్టుకు శిక్షణ ఇవ్వటం సంతోషంగా ఉంది: శ్రీనివాస్‌రెడ్డి

కొరియా జట్టు కోచ్‌గా ఎంపిక కావటం ఆనందంగా ఉంది. ఇండియా కబడ్డీ క్రీడాకారునిగా తాను ఓ విదేశీ జట్టుకు ఆరు నెలలపాటు శిక్షణ ఇవ్వనుండటం గర్వంగా ఉంది. ఆంధ్రాబ్యాంకు యాజమాన్యం, సహచర క్రీడాకారుల ప్రోత్సాహం వల్లే  కొరియా జట్టు కోచ్‌గా ఎంపికయ్యా. కొరియా జట్టును ఉత్తమ జట్టుగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఇందుకోసం అవసరమైన వ్యూహ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాను. ఇండియా కబడ్డీ జట్టుకు కోచ్ కావాలన్నదే నా లక్ష్యం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement