ఆ.. ముగ్గురు హ్యాట్రిక్‌ విజేతలు | Story About Manthani Constituency Political Leader | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 7 2018 10:43 AM | Last Updated on Wed, Nov 7 2018 11:02 AM

Story About Manthani Constituency Political Leader - Sakshi

సాక్షి, పెద్దపల్లి :  ఎన్నికల్లో ఒక్కసారి గెలువడమే కష్టంగా మారిన పరిస్థితి. అలాంటిది వరుసగా మూడు పర్యాయాలు విజయం సాధించడమంటే మాటలు కాదు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు ఇలాంటి హ్యాట్రిక్‌ విజయాలు సొంతం చేసుకున్నారు. ఒక్క మంథని నియోజకవర్గం నుంచే ముగ్గురు నేతలు ఈ ఘనతను సాధించడం మరో విశేషం. 

హ్యాట్రిక్‌ వీరులు 
పెద్దపల్లి జిల్లాలోని మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలు హ్యాట్రిక్‌ విజయాలు సొంతం చేసుకున్నారు. వరుసగా మూడుసార్లు ఈ నేతలను గెలిపించి, నియోజకవర్గ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందులో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ అరుదైన రికార్డును తమ పేరిట రాసుకున్నారు. 1952లో మంథని అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడగా, ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1957వ సంవత్సరం నియోజకవర్గంలో జరిగిన రెండో ఎన్నికలోనే పీవీ నరసింహారావు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలి విజయం అందుకున్నారు. ఆ తరువాత 1962, 1967, 1972 సంవత్సరాల్లో గెలుపొందారు. మంథని నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు విజయం సాధించిన పీవీ నరసింహారావు రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధాని పదవులను అలంకరించారు. ఇక మావోయిస్టుల చేతిలో హతమైన అసెంబ్లీ మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు 1983, 1985, 1989ల్లో జరిగిన ఎన్నికల్లో గెలవడం ద్వారా హ్యాట్రిక్‌ రికార్డు నమోదు చేసుకున్నారు. శ్రీపాదరావు హత్య అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనయుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సైతం హ్యాట్రిక్‌ వీరుడిగా రికార్డుకెక్కారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుస గెలుపులతో హ్యాట్రిక్‌ విజయాలు సాధించి తన తండ్రి సరసన నిలిచారు. 

కాంగ్రెస్‌ ‘హ్యాట్రిక్‌’ 
మంథని నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలు హ్యాట్రిక్‌ విజయాలు సాధించగా, ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈ రికార్డును సొంతం చేసుకోవడం మరో విశేషం. కాంగ్రెస్‌పార్టీపై పోటీ చేసిన పీవీ నరసింహారావు 1957లో పీడీఎఫ్‌ అభ్యర్థి నంబయ్య, 1962లో స్వతంత్ర అభ్యర్థి జి.శ్రీరాములు, 1967లో స్వతంత్ర అభ్యర్థి కమల మనోహరరావు, 1972లో టీపీఎస్‌ అభ్యర్థి ఈ.వి.పద్మనాభన్‌లపై విజయం సాధించారు.  

దుద్దిళ్ల శ్రీపాదరావు 1983లో టీడీపీ అభ్యర్థి సీఆర్‌రెడ్డి, 1985లో టీడీపీ అభ్యర్థి బి.నరసింగారావు, 1989లో టీడీపీ అభ్యర్థి బెల్లంకొండ సక్కుబాయిలపై గెలుపొందారు.  
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 1999లో టీడీపీ అభ్యర్థి చంద్రుపట్ల రాంరెడ్డి, 2004లో టీడీపీ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ, 2009లో పీఆర్‌పీ అభ్యర్థి పుట్ట మధులపై గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. 

మూడుసార్లు గెలుపొందిన ‘గీట్ల’, ‘మాతంగి’
పెద్దపల్లి నియోజకవర్గంలో జిన్నం మల్లారెడ్డి హ్యాట్రిక్‌ సాధించగా..  మరో ఇద్దరు నేతలు సైతం మూడు పర్యాయాలు విజయం సాధించారు. పెద్దపల్లి నుంచి దివంగత గీట్ల ముకుందరెడ్డి, మేడారం నుంచి మాతంగి నర్సయ్యలు ఈ ఘనతను సాధించారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గీట్ల ముకుందరెడ్డి మూడుసార్లు గెలుపొందారు. 1983, 1989, 2004 సంవత్సరాల్లో ప్రజలు గీట్ల ముకుందరెడ్డిని ఆదరించారు. కాగా ఇందులో రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా, ఒకసారి టీఆర్‌ఎస్‌ నుంచి గీట్ల గెలుపొందారు. ఇక మేడారం(రామగుండం) నుంచి 1983, 1989, 1999ల్లో మాతంగి నర్సయ్య గెలుపొందారు. ఇందులో రెండుసార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement