అదృశ్యమైన విద్యార్థులు ఒరిస్సాలో ప్రత్యక్షం
నల్లగొండ క్రైం : జిల్లా కేంద్రంలో ఆదివారం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినులు సోమవారం ఒరిస్సాలో ప్రత్యక్షమయ్యారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ నాగరాజు కుమార్తె పవిత్ర మర్రిగూడలోని ఎంవీఆర్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన మరో విద్యార్థిని జంజిరాల సైదులు కుమార్తె పావని చైతన్య వైష్ణవి స్కూల్‌లో 4వ తరగతి చదువుతోంది. వీరిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి.
ఇద్దరూ ఆడుకుంటు లాలిపాప్స్ కొనుక్కునేందుకు రైల్వేస్టేషన్ వైపు ఉన్న దుకాణం వద్దకు వెళ్లారు. అటునుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఒకే చోట ఆడుకుంటున్న విద్యార్థులు 5.30 గంటలకు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు ఆడుకుని వచ్చిపోయే రైళ్లను చూస్తున్నారు. 6.15 నిమిషాలకు ఫలక్‌నూమా రైలు రావడంతో అందులోకి ఎక్కి దిగుతుండడంతో ఫ్లాట్ మీద ఉన్న ప్రయాణికులు రైల్లో వచ్చిన విద్యార్థులు ఏమో అనుకుని రైలు కదులుతుంది ఎక్కండి అని గట్టిగా చెప్పడంతో మళ్లీ రెలైక్కారు.
టీసీ గమనించడంతో..
ఫలక్‌నూమా రైలులో మిర్యాలగూడ ప్రాంతానికి ఓ వ్యక్తి టీసీగా పనిచేస్తున్నా డు. ఒరిస్సా ప్రాంతంలోని కుర్ధా రైల్వే స్టేషన్‌కు రైలుచేరుకుంది. ప్రయాణికులందరూ దిగిపోయినప్పటికీ వారు దిగలేదు. ఈ ఇద్దరు చిన్నారులు తెలుగులో మాట్లాడుకోవడం టీసీ గమనించాడు. వారి కుటుంబ వివరాలు తెలుసుకుని నల్లగొండ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. కాగా, ఆ ఇద్దరు చిన్నారులను తీసుకురావాలని పోలీసులు అక్కడికి వెళ్లారు.