చంపేసి.. ఆపై కాల్చేసి
పరిగి: ఓ రైతు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను చంపేసి మృతదేహాన్ని కాల్చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని రంగాపూర్‌లో బుధవారం వెలుగుచూసింది. హతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల పరిధిలోని సిరిగాయపల్లికి చెందిన సుర్క వెంకటయ్య(42) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఆయన మంగళవారం పరిగి బ్యాంకులో పని ఉందని కుటుంబీకులకు చెప్పి ఇంట్లోంచి వె ళ్లాడు. రాత్రి ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలించసాగారు. కాగా సిరిగాయపల్లి సమీపంలోని రంగాపూర్ వ్యవసాయ పొలాలకు వెళ్లే పానాదిలో ఓ వ్యక్తి మృతదేహంగా పడి ఉన్నాడు. మృతదేహం కాలిపోయి ఉంది. బుధవారం ఉదయం రంగాపూర్ రైతులు విషయం గమనించారు. పరిగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ ప్రసాద్, ఎస్‌ఐ కృష్ణలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతుడి వివరాల గురించి స్థానికులను ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది.
అదే సమయంలో తన తండ్రి కనిపించకపోవటంతో వెంకటయ్య కుమారుడు సుర్క విఠల్(23) అక్కడికి చేరుకున్నాడు. హతుడి దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా తన తండ్రేనని అతడు గుర్తించాడు. తమ గ్రామానికి చెందిన కొందరితో తమకు గొడవలు ఉన్నాయని, వారే తన తండ్రిని హత్య చేసి ఉండొచ్చని విఠల్ పోలీసులకు చెప్పాడు. కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు వెంకటయ్య మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. హతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.